2024-07-27 06:13:39
TSRTC Privatization : కేసీఆర్.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే లాభపడేదెవరు? – Sirimalli.com

TSRTC Privatization : కేసీఆర్.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే లాభపడేదెవరు?

TSRTC Privatization : తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటువాళ్లకు ఇచ్చేస్తున్నారా? ఆర్టీసీ బస్సెళ్లే ప్రతీ చోటా ఇదే మాట. అసలిప్పటివరకు ఇలాంటి ఆలోచనే లేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ యాంగిల్ లో ఆలోచిస్తున్నారు? నష్టాలు వచ్చేస్తున్నాయంట.. అందుకే ప్రైవేటు రూటట. అసలీ ఆలోచన ఇచ్చింది ఎవరో కాని వాళ్లకు సాష్టాంగ నమస్కారం పెట్టాలి. లేకపోతే ఏంటి? లక్షల కోట్ల ఆస్తులున్న ఆర్టీసీని.. కేవలం రెండు మూడు వేల కోట్ల రూపాయిల నష్టాలొచ్చాయిని ప్రైవేటీకరించేస్తారా? బంగారు బాతు గుడ్లు పెట్టడం తగ్గించిందని ఎవరైనా కసాయివాడికి అమ్మేస్తారా? ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే.. ప్రభుత్వానికి ఆర్థికంగా భారం తగ్గొచ్చేమో కాని.. ప్రజల నుంచి సానుకూల ధోరణి రావడం కష్టం. ఎందుకంటే కోట్లాదిమందికి ఆర్టీసీ (TSRTC Privatization) అంటే తరతరాలుగా వారి జీవితంలో ఓ భాగం.

కూరగాయలు అమ్మేవాళ్ల నుంచి కూలీనాలి చేసుకునేవారి వరకు అందరికీ ఆర్టీసీయే దిక్కు. ప్రైవేటు బస్సులు ఎక్కాలంటే పైసలు మస్తుండాలి. కానీ ఆర్టీసీ బండెక్కితే సర్కారు నిర్ణయించిన టిక్కెట్ రేటు ఇస్తే చాలు. రయ్ రయ్ మంటూ ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. కానీ ఇప్పుడు దానిని ప్రైవేటీకరణ (Privatization) చేస్తే ఆర్టీసీ బస్సెక్కడం కన్నా ముందు బస్టాండ్ లోకి వెళ్లాలన్నా సరే టిక్కెట్ కొని అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇక బస్సెక్కాలంటే మరో టిక్కెట్ కొనాలి. ఏ పండగో వచ్చిందంటే డబుల్ రేటు ఇవ్వాలి. మరి సామాన్యుడు అంత ఖర్చు పెట్టగలడా?

ఒక ప్రైవేటు ఆటోవాడు (auto)బండి తీయాలంటే.. అది నిండితే కాని స్టార్ట్ చేయడు. మరి ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే.. ఆ బస్సు (bus) పరిస్థితి కూడా ఇంతేగా. ఇప్పటిలా టైముకు నడుస్తాయా? నష్టాలొస్తే ప్రభుత్వం భరిస్తుంది కాని ప్రైవేటు వాడు భరిస్తాడా? అప్పుడు ప్రజల్లో అసహనం, కోపం వస్తే అదంతా ఎవరిపైకి ఎలా మళ్లుతుంది? ఏంటిలా చేశారని విమర్శించరా? దాని ఫలితం సరైన సమయంలో కనిపించదా? అందరికీ అన్ని రకాల బంధుపథకాలు అందించే ప్రభుత్వం.. తమకు మాత్రం ఏ బంధును అందించడం లేదే అని ఆర్టీసీ ఉద్యోగులు బాధపడుతున్నారు.

గతంలో ఆర్టీసీ ఉద్యోగులు (employees)సమ్మె చేసినా సరే ప్రభుత్వం చాలా రోజుల పాటు పట్టించుకోలేదు. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని ఆ సమయంలోనే చెప్పారు. ఆర్టీసీలో కార్గో (rtc cargo) సర్వీసును పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టింది కూడా అప్పుడే. ఇప్పుడది లాభాల బాటలో ఉంది. ప్రైవేటువాళ్ల చేతుల్లో పెడితే వాళ్లు ఎప్పుడుపడితే అప్పుడు, ఎలా పడితే అలా టిక్కెట్ రేట్లు పెంచేస్తారు. వాళ్లు తమ లాభాల (profit) కోసమే ఆలోచిస్తారు కాని, సామాన్యుడి కోసం క్షణమైనా వెచ్చిస్తారా? మరి సామాన్యుడు అంత భారం ఎలా భరించలగడు? చివరకు ఆ భారమంతా భరించాల్సింది సామాన్యుడే కదా!

తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటైజేషన్ వచ్చే లాభం.. ఉద్యోగులకి కాని.. ప్రభుత్వానికి కాని అందదు. అదంతా ప్రైవేటు వాళ్లకే వెళుతుంది. ఇక ప్రైవేటు వాళ్ల చేతికి ఆర్టీసీ లాంటి వ్యవస్థ వెళితే అది పరుగులు పెట్టొచ్చేమో కాని.. ఆ పరుగును సామాన్యుడు మాత్రం అందుకోలేడు. అప్పుడు బకరా అయ్యేది ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆర్టీసీని రైట్ రైట్ అంటారా.. స్టాప్ స్టాప్ అంటారా అన్నది ప్రభుత్వ ఇష్టం. కేవలం నాలుగు నెలల్లో ఆ బండిని లాభాల బాటలో నడిపించడం కష్టమే కావచ్చు. ఒకవేళ ఫలితం కనిపించినా సరే.. ప్రభుత్వం కాస్తా ప్రైవేటు మంత్రం జపిస్తే.. ఇక అంతే సంగతులు.

Also Read :

For More Updates Follow us on – Sirimalli Page