Who is Bhupendra Patel : గుజరాత్ కి కొత్త బాస్… ఎవరీ భూపేంద్ర పటేల్‌..?

Who is Bhupendra Patel : గుజరాత్ కి కొత్త బాస్ వచ్చాడు.. ఆయనే.. భూపేంద్ర ప‌టేల్.. విజయ్ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆదివారం సమావేశమైన గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం భూపేంద్ర ప‌టేల్(Who is Bhupendra Patel ) పేరును ఖరారు చేయగా, దీనికి బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో తదుపరి ముఖ్యమంత్రుల రేసులో డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, ప్రఫుల్‌ ఖోడా పటేల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరకి ఎవరు ఊహించని పేరు తెరపైకి వచ్చింది. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్‌ ని సీఎం చేయడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇంతకీ ఎవరీ భూపేంద్ర పటేల్‌..?

భూపేంద్ర ప‌టేల్ అసలు పేరు భూపేంద్రభాయ్ పటేల్.. ఆయన వయసు 59ఏళ్ళు.. పటీదార్ సామాజికవర్గానికి చెందిన ఈయన.. పాలిటెక్నిక్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా పొందాడు. RSSలో చాలా కాలం పాటు పనిచేశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌ను 1,17,000 ఓట్ల తేడాతో ఓడించారు.. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో భారీ అధిక్యంతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.. కేంద్ర మంత్రి అమిత్‌‌షా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ లోక్‌‌సభలో భాగంగా ఈ ఘట్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది.

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అమెకి అత్యంత నమ్మకస్తుడిగా భూపేంద్ర ప‌టేల్ కు పేరుంది. ఎమ్మెల్యే కాకముందు గతంలో ఆయన అహ్మదాబాద్‌లోని మెమ్నాగర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

ఐదేళ్ల తర్వాత బీజేపీ మళ్లీ పటీదార్‌ కమ్యూనిటీకి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేసింది. గుజరాత్ లో మొత్తం 182 నియోజకవర్గాలు ఉండగా.. ఇందులో 71 నియోజకవర్గాల్లో పటీదార్లే కీలకంగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మొత్తం పటీదార్లు 15 శాతం ఉన్నారు. వీళ్ల ఓట్లు కీలకం కావడంతో ఆ కమ్యూనిటీకి చెందిన నాయకుడినే సీఎంగా ప్రకటించింది అధిష్టానం.

Also Read :