Cinema

4 పాటలు, 6 ముద్దులకే హీరోయిన్లను ఎందుకు లాక్ చేస్తున్నారు?

ఆరు పాటలు, ఆరు ముద్దు సీన్లేనా?
ఆమె అందం కావాలి. ఆమె యాక్టింగ్ కావాలి. ఆమె డ్యాన్సులు కావాలి. హీరోల కామెడీని పండించడానికి ఆమె క్యారెక్టర్ కావాలి. కాని ఆమెకు మాత్రం ప్రాధాన్యత అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ ల పాత్ర ఇంతే. ఆమాటకొస్తే తెలుగుసినిమా అనే ఏముంది.. కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ చూసినా ఇంతే. ఏవో నాలుగైదు పాటలు. అయినా నాలుగైదు పాటలు ఎక్కడున్నాయి లెండి ఒక సినిమాకు ఇద్దరు హీరోయిన్లుంటే.. రెండు, మూడు పాటలకు మించి ఎవరికీ రావడం లేదు. ఏవో కాసిన్ని సీన్లు. అది కూడా క్లైమాక్స్ కి ముందే. ఎందుకంటే.. క్లైమాక్స్ లో హీరోయిన్ లను చూపిస్తే.. హీరోయిజాన్ని చూపించడానికి అవ్వదు. అసలు వెండితెరపై ఉండే హీరోయిన్ల పాత్రలను ఎందుకిలా తగ్గించేస్తున్నారు? మళ్లీ గొప్ప మహిళా చిత్రమని పేర్లు వేసుకుంటారు. మహిళా ప్రేక్షకుల వల్లే తమ సినిమా హిట్టయ్యిందని డబ్బాలు కొట్టుకుంటారు. కానీ ఆ మహిళకు మాత్రం వెండితెరపై సరైన స్థానాన్ని మాత్రం ఇవ్వరు.

ఈ 5 పాత్రలతోనే మహిళలను కట్టేస్తున్నారు
తల్లి పాత్ర, చెల్లి పాత్ర, ప్రియురాలి పాత్ర.. భార్య పాత్ర, స్నేహితురాలి పాత్ర.. ఇలా అన్ని పాత్రలతో సెంటిమెంట్ ని పండించేస్తారు. పైగా వెండితెరపై కాసుల వర్షం కురిపించేలా నటించాలి. కాని లీడ్ రోల్ మాత్రం ఇవ్వరు. చాలా సినిమాల్లో ఇంతే. పాత సినిమాల్లో కనీసం హీరోయిన్లకు కాసిన్ని పవర్ ఫుల్ డైలాగులైనా ఉండేవి. ఇప్పుడవీ తగ్గిపోతున్నాయి. రానురాను కామెడీని పండించడానికే పరిమితమవుతున్నాయి. ప్రతీ మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. సినిమాల విజయం, సినిమావాళ్ల విజయం వెనుక కూడా ఉండేది మహిళే. కాని ఆమె తెరపై పెద్దగా కనిపించదు. అదేమంటే మనది హీరోయిజం డామినేట్ చేసే ఇండస్ట్రీ అంటారు. ఇలా అయితే సొసైటీకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

లేడీస్ ని ఫ్యాషన్ కు ఎలా పరిమితం చేశారంటే?
హీరోయిన్లే.. హీరోయిజాన్ని పండిస్తూ సినిమాలు రాలేదా అంటే.. అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అలా వచ్చినవాటిలో చాలా సినిమాలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. వాటిని చూసినవారిలో మగ ప్రేక్షకులు, మహిళాప్రేక్షకులు ఇద్దరూ ఉన్నారు. అంటే హీరోయిన్ల చుట్టూ అల్లుకునే కథలతో సినిమాలు తీసినా చూడడానికి ప్రేక్షకులు రెడీ. మరి అలాంటి సినిమాలు తీయడానికి ఇండస్ట్రీకి ఏం వచ్చింది? ఎంతసేపూ ఫ్యాషన్ పేరుతో అందంగా చూపించడానికి ఇచ్చే ప్రాధాన్యతను.. కాస్త మంచి క్యారెక్టర్ ఇవ్వడంలో కూడా చూపించవచ్చు కదా.

మహిళలను గౌరవించే పద్దతి ఇది..
మహిళలు ఎక్కడ బలంగా ఉంటే ఆ సమాజం అక్కడ అంత ఉన్నతంగా ఎదుగుతుంది. అయినా ఇంట్లోనుంచి మొదట మార్పు మొదలవ్వాలి. ఇంట్లో మహిళలను ఎప్పుడైతే ఉన్నతంగా చూడడం మొదలుపెడతారో.. అక్కడి నుంచి మార్పు మొదలవుతుంది. అది సమాజంలోకి వెళుతుంది. అప్పుడీ సోకాల్డ్ ఇండస్ట్రీ వాళ్లు కూడా చచ్చినట్టు ఆ మార్పులకు అనుగుణంగా సినిమాలు తీస్తారు. మహిళ లేనిదే మనుగడ లేని సమాజమిది. ఆకాశంలో సగం అనే పెద్దలు.. అవకాశాల్లో మాత్రం సగం ఇవ్వరు. అలాంటప్పుడు సినిమాలోనూ సగభాగాన్ని డిమాండ్ చేయడం అత్యాశే అవుతుంది. అందుకే తెరపై చూపించే మహిళా పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటే.. సమాజంలో పోరాడే మహిళలకు అంత బలం చేకూరుతుంది. వెండితెరపై రోల్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే.. సొసైటీలో మహిళలకు అంత గౌరవం పెరుగుతుంది. కాబట్టి.. ఇకనైనా ఈ మార్పును తెలుగు ఇండస్ట్రీ గుర్తిస్తుందని ఆశిద్దాం.