Cinema

ఆ సీన్లో కన్నీళ్లు.. ఈ సీన్లో కుట్రలు.. సీరియల్స్ లో ఎందుకిన్ని కుతంత్రాలో తెలుసా?

సీరియల్ అంటే.. ‘సీ’ ‘రియల్’. అంటే నిజాన్ని చూడమని. కాని ఇప్పుడు వస్తున్న సీరియళ్లన్నీ నిజంగానే నిజాన్ని చూపిస్తున్నాయా? ఎందుకంటే చాలా సీరియల్స్ లో ఏడుపులు, కుట్రలు, కుతంత్రాలే ఎక్కువ. కాని కుటుంబాల్లో మరీ ఇంత తీవ్రమైన కుట్రలు, కుతంత్రాలు, కన్నీళ్లు ఉంటాయా? కాకపోతే ఈమధ్య కాస్త ట్రెండ్ మారింది. సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా పాటల్ని తీస్తున్నారు. భారీ డ్యాన్సులు లేకపోయినా.. పాత తరంలో కొందరు హీరోలు స్టెప్పులేయకుండానే పాట మొత్తం నటించేవాళ్లు కదా అలా కొన్నిసార్లు నడిపించేస్తున్నారు. సరే.. ఏ సీరియల్ కా పాట అందం. ఇది కాస్త నయం. ఎందుకంటే చాలా సీరియల్స్.. గ్లిజరిన్ సీరియల్సే. ఉల్లిపాయ తరక్కుండానే మహిళల కంట్లోంచి ధారాళంగా కన్నీళ్లు తెప్పించే శక్తి సీరియళ్లకు ఉంది.

సీరియల్ కు, కాపురంలో కలతలకు..
పెళ్లయిన తరువాత అప్పగింతల సమయంలో అత్తమామలు అల్లుడిని ఓ కోరిక కోరుతారు. మా అమ్మాయి కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకోండి అల్లుడుగారు అని. కానీ, ఇప్పటి అల్లుళ్లయితే ఇచ్చే సమాధానం ఒక్కటే. మీ అమ్మాయి టీవీలో సీరియళ్లను చూసినప్పుడు తప్ప.. మిగతా ఏ సమయంలోనూ కన్నీళ్లు రానివ్వను మామగారు అంటూ దీనంగా మాటిస్తారు. ఇది నవ్వుకోవడానికి సరదాగానే ఉన్నా.. హాల్లోంచి వంటింట్లోకి ఆ తరువాత బెడ్రూమ్ లోకి కూడా చేరిపోతున్నాయీ సీరియళ్ల టాపిక్కులు. గతంలో ఇంట్లో ముచ్చట్లు, ఇరుగుపొరుగు అచ్చట్ల గురించి బెడ్రూమ్ లో మాట్లాడుకునేవారు. కానీ, ఇప్పుడు ఆ సీరియళ్లో అలా, ఈ సీరియళ్లో ఇలా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. కొన్నాళ్ల తరువాత.. మీ ఇంట్లో, కాపురంలో కలతలకు, మా సీరియల్ కు ఎలాంటి సంబంధం లేదని సదరు సీరియల్ వారు డిస్క్లైమర్ వేసుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. అన్ని సీరియళ్లు ఇలానే ఉంటాయని కాదు కాని.. కొన్ని మాత్రం అలానే ఉంటున్నాయి. తెలుగు భాషలో వచ్చే సీరియల్స్ లో అయితే ఒక్కో దానిది ఒక్కో దారి.

సీరియళ్లలో ఏడుపు సీన్లు ఎందుకు ఎక్కువంటే..?
సీరియల్స్ చూసేవారిలో మహిళలే ఎక్కువ. అందుకే వారిని ఆకట్టుకోవడానికి సెంటిమెంట్ ను ఎక్కువగా పండిస్తారు. సెంటిమెంట్ ఎక్కువైనా, తక్కువైనా వచ్చేది కన్నీరేగా. అందుకే వర్షాలతో సంబంధం లేకుండా సీరియల్స్ లో టీఎంసీల కొద్దీ కన్నీటి వరద పోటెత్తుతుంది. ప్రతీ ఎపిసోడ్ లోనూ ఓ కన్నీటి సీన్ ని పెట్టుకోగలిగితే.. ఆ రోజుకు రేటింగ్ ను కాపాడుకున్నట్టే అన్నటుగా మారిపోయింది పరిస్థితి.

సీరియల్స్ లో గ్రాఫిక్స్ మాయాజాలం వెనుక..
ఇంతకుముందు విఠలాచార్య సినిమాల్లో, తరువాత కోడిరామకృష్ణ చిత్రాల్లో, ఆ తరువాత రాజమౌళి, క్రిష్ లాంటి డైరెక్టర్ల మూవీల్లో గ్రాఫిక్స్ పవరేంటో చూశాం. ఇప్పుడు సీరియల్స్ లో అలాంటి సీన్లను పెట్టేస్తున్నారు. అంటే భారీ గ్రాఫిక్స్ ని చూడడానికి ఇకపై థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇంట్లోనే కూర్చుని టీవీలోనే చూసేయచ్చన్నమాట. దీనివల్ల సినిమా ప్రేక్షకులు కూడా కొంతమంది టీవీలవైపు వచ్చేస్తున్నారు. అందుకే సీరియల్స్ కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.

అమృతం లాంటి సీరియళ్లను జనం ఇష్టపడ్డారా?
అమృతం సీరియల్ వచ్చినన్నాళ్లు ఇంట్లో ఆ కాసేపైనా కుటుంబమంతా హ్యాపీగా నవ్వుకునేది. అంటే ఎటువంటి అసభ్యకరమైన డైలాగ్స్ కాని, సన్నివేశాలు కాని లేకుండా.. ఫుల్ లెంగ్త్ కామెడీతో తీసిన సీరియల్ అది. సరదాగా నవ్వుకోవడానికి అలాంటి సీరియళ్లను హ్యాపీగా చూడొచ్చు. కానీ ఇప్పుడొస్తున్న సీరియల్స్ లో అలాంటి క్లీన్ కామెడీ తగ్గుతోందనే చెప్పాలి. పైగా పాత సామాన్లని కిలోల లెక్క తూకమేసి అమ్మినట్టు.. పాత సీరియళ్లని అరగంటల లెక్క తూకమేసి.. మళ్లీ మళ్లీ జనం మీదకు వదులుతున్నారు. దేనికైనా కొంతవరకే లిమిట్. అత్యాశకు పోయి అతి చేస్తే.. అతివల చేతిలో అభాసుపాలు కాక తప్పదు. కాని, కుటుంబ విలువలు పెంచే, కాసేపు సరదాలను పంచే సీరియల్స్ కి ఎప్పుడూ ఆదరణ ఉంటుందని మర్చిపోకపోతే మంచిది.