Cinema

జబర్దస్త్ కు యూట్యూబ్ లో అన్ని లైక్స్ ఎలా వస్తాయో తెలుసా?

జోకేస్తే నవ్వాలి. నవ్వడమంటే అలా ఇలా కాదు.. పకపకమని పడీ పడీ నవ్వాలి. ఈ కాలంలో అలాంటి జోకులేమున్నాయే అంటే చెప్పలేం. జోకాల్సిన వాళ్లు జోకాలే కాని.. నవ్వలేక పొట్ట చెక్కలవ్వాల్సిందే. అప్పట్లో జంధ్యాల గారి సినిమాల్లో అలాంటి క్లీన్ కామెడీ కనిపించేది. తరువాత వచ్చినవాళ్లంతా డబుల్ మీనింగ్ డైలాగులతో జోకులు పేల్చినవాళ్లే కాని.. హెల్దీ కామెడీని ఎక్కడ చూపించారు. సరే ఇప్పుడంటే టీవీల్లో జబర్దస్త్ లాంటి షోలతో జనాల్ని కాసేపు నవ్విస్తున్నారనుకోండి. ఇంతకీ ఈ కామెడీ షో కు యూట్యూబ్ లో ఎందుకు అన్ని హిట్స్ వస్తాయో తెలుసా?

జబర్దస్త్ కు యూట్యూబ్ లైకుల కోసం..
జబర్దస్త్ లో కొన్ని టీములైతే.. ఎపిసోడ్ మొత్తం జోకులు, పంచ్ లను వరుసగా పేల్చుతూనే ఉంటాయి. గుక్కతిప్పుకోనివ్వని పేజీలకొద్దీ డైలాగులు ఉండవు. ఓ రెండు మూడు పదాలు, కాదంటే.. డైలాగ్ మొత్తం ఓ లైనులో పూర్తయిపోతుంది. అంతే!. ఇంత సింపుల్ గా, అంత జబర్దస్త్ గా ఉండబట్టే.. ఆ కామెడీ స్కిట్లకు అంత డిమాండ్. లేకపోతే ఎపిసోడ్ ను అలా యూట్యూబ్ లో పెట్టడమే ఆలస్యం.. లక్షల్లో వ్యూస్ ఎలా వస్తాయి చెప్పండి. దానికంత డిమాండ్ ఉంది మరి. కాసేపు రిలాక్స్ అవ్వాలంటే చాలామంది ఆప్షన్ జబర్దస్త్. అంటే దీంతోపాటు యూట్యూబ్ లో మంచి కామెడీని పంచే.. షార్ట్ ఫిల్ములు, స్కిట్లు ఉన్నా సరే.. ఇదో బ్రాండు కదా.. తొందరగా జనంలోకి వెళ్లిపోయింది.

టీము లీడర్ల పేర్ల వెనుక సీక్రెట్
రాకెట్ రాఘవ, హైపర్ ఆది.. ఇలా టీము లీడర్ల పేర్లే కామెడీగా ఉంటాయి. నిజానికి రాఘవ, ఆది.. ఇలా చెబితే ఎవరి చెవికెక్కుతుంది. అందుకే.. దానికి కాస్త కలరింగ్ ఇవ్వడానికి, రాకెట్లు, హైపర్లను తగిలించారు. అది కాస్త సక్సెస్ అయ్యింది. ఇప్పుడు జనం కూడా ఇవే పేర్లతో పిలుస్తున్నారు. వాటికే అలవాటు పడిపోయారు. గురు శుక్రవారాల్లో రాత్రయిందంటే చాలు.. చాలా ఇళ్లలోని టీవీల్లోంచి జబర్దస్త్ ఆడియో వినిపిస్తూ ఉంటుంది. అంటే భోజనాలు చేస్తూ.. కాసేపు సరదాగా నవ్వుకుంటూ అదే మూడ్ లో నిద్రపోతారు. దానివల్ల హ్యాపీగా నిద్రపోవడానికి ఛాన్సుంటుంది.

జబర్దస్త్ లో డైలాగులు శ్రుతి మించుతున్నాయా?
జబర్దస్త్ లో వస్తున్నదంతా క్లీన్ కామెడీయే అని చెప్పలేం. మహిళల మీద జోకులు పేలుతూనే ఉంటాయి. సరదాగా నవ్వుకోవడానికి అయితే ఓకే అనుకోవచ్చు. కానీ ఒక్కోసారి శ్రుతి మించుతాయి. మహిళల పాత్ర లేకుండా కూడా జోకులు పేల్చవచ్చు. అలాంటివాటికి ఆ రైటర్లు ప్రాధాన్యత ఇస్తే మంచిది. లేకపోతే.. గొప్ప మహిళా చిత్రం అని వెనకటికి పోస్టర్ల మీద వేసుకునేవాళ్లు. అలా మహిళలు మెచ్చిన గొప్ప కామెడీ షో అని చెప్పుకోవడానికి వీల్లేకుండా పోయే ప్రమాదముంది. అందుకే స్కిట్ల విషయంతో పాటు కాస్త డైలాగుల విషయంలోనూ కేర్ తీసుకుంటే మంచిది.

జబర్దస్త్ ని పిల్లలు చూడడం మంచిదేనా?
ఇకపోతే.. జబర్దస్త్ ని పెద్దోళ్లే కాదు పిల్లలూ చూస్తున్నారన్న సంగతిని షో నిర్వాహకులు మర్చిపోకపోతే మంచిది. కొన్ని డైలాగులను పెద్దలు మాత్రం అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అవన్నీ A సర్టిఫికెట్ డైలాగులు. అలాంటివాటిని విన్న పిల్లలు.. అమ్మా దానర్థం ఏమిటి?, నాన్న దీని మీనింగ్ ఏమిటి అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంటోంది. సో.. షో ఎలాగూ హిట్టయ్యింది కదా.. కాస్త క్లీన్ గా కూడా చేస్తే మంచిదే కదా. మరికొంతమంది ప్రేక్షకులను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.