Life Style Off Beat

అక్షయ తృతీయనాడు బంగారం కన్నా.. రూ.10 పెట్టి దీనిని కొంటే ఇంకా ఎక్కువ పుణ్యం, ఐశ్వర్యం!

ఏడాది మొత్తంలో బంగారాన్ని కొన్నాకొనకపోయినా అక్షయ తృతీయ రోజున మాత్రం కచ్చితంగా కొంటారు. కారణం.. ఆ రోజున గోల్డ్ కొంటే కలిసొస్తుందని. శాస్త్రీయ కారణాలు చాలామందికి తెలియకపోయినా అది నిజమే. ఎందుకంటే.. అక్షయం అంటే తరుగులేనిది, తగ్గిపోనిది అనే అర్థాలు ఉన్నాయి అంటే వద్ధి చెందుతూనే ఉంటుంది అని అర్థం. బంగారం అంటే ఆడవారికి చాలా ఇష్టం. అందుకే అక్షయ తృతీయ రోజున కొంటే అది నానాటికీ వృద్ధి చెందుతూనే ఉంటుంది అని వారి నమ్మకం. ఈ సంగతి తెలిసిన బంగారం వ్యాపారులు ఆగుతారా! అందుకే స్పెషల్ ఆఫర్లతో అదరగొట్టేస్తారు. మగువలను ఆకర్షిస్తారు. నిజానికి అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం కొనడమే కాదు.. కొన్నింటిని దానమిస్తే అంతకన్నా పుణ్యం వస్తుందంటున్నారు పండితులు.

వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా పిలుస్తారు. ఈ పుణ్యదినానికి చాలా చరిత్ర ఉంది. దానికన్నా ముందు బంగారం కొనుగోలు విషయానికి వద్దాం. బంగారం అంటే స్వర్ణం. ఈ స్వర్ణంలో కలి పురుషుడు ఉంటాడంటారు. అంటే ఈరోజున బంగారం కొని ఇంట్లో దాచుకుంటే.. కలిపురుషుడిని ఏరి కోరి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నట్టు అవుతుందా? దీనివల్ల ఎలాంటి పాపం కష్టనష్టాలు ఎదురవుతాయి? ఎలాంటి పాపాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది? అసలు దీనిపై పండితులు ఏమంటున్నారు?

అక్షయ తృతీయ నాడు కొన్ని వస్తువులు కొనడం వరకు సరే, కాని శాస్త్రం చెప్పిన వస్తువులను దానం చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలాన్ని తమ ఖాతాలో జమ చేసుకున్నవాళ్లు అవుతారు. శాస్త్ర ప్రకారం చూస్తే.. అక్షయ తృతీయ నాడు ఉదకబాంఢం దానం చేయాలి. స్వయంపాకం ఇవ్వాలి. ద్రవ్యం.. అంటే డబ్బును దానం చేయాలి. చెప్పుల జత ఇవ్వచ్చు. గొడుగును దానం చేయచ్చు. బట్టలు కూడా ఇస్తారు. ఈ పర్వదినం వేసవి కాలంలో వస్తుంది కనుక.. జనం దాహాన్ని తీర్చేలా మంచినీరు, మజ్జిగ, మామిడిపళ్లు.. ఇతరత్రా దానాలు చేయచ్చు. దానివల్ల వచ్చే ఫలితం అక్షయమౌతుంది. అంటే ఎప్పటికీ తరిగిపోదు. తగ్గదు. నారదపురాణం చెప్పేది ఇదే.

అక్షయ తృతీయకు ఎందుకింత ప్రాధాన్యత వచ్చిందంటే.. కుబేరుడు.. సంపదకు రక్షకుడిగా అయిన రోజు. మహాలక్ష్మిని ఆ నారాయణుడు పెళ్లి చేసుకున్న రోజు. అందుకే చాలామంది ఈరోజున బంగారం కొని లక్ష్మీదేవికి పూజ చేయడానికి ఇష్టపడతారు. దీనివల్ల అష్టైశ్వర్యాలు తమకు కలుగుతాయని చాలామందికి నమ్మకం. అందరూ బంగారం కొనగలరని చెప్పలేం. అందుకే అలాంటివాళ్లు వెండిని కొనుక్కోవచ్చు. అది కూడా సాధ్యం కాని వాళ్లు.. ఉప్పు కొన్నా మంచిదే అంటారు పండితులు. వీటితోపాటు బియ్యం, పప్పులు.. ఇలా ఇంట్లో వంటకు ఉపయోగించే నిత్యావసరాలను కొన్నా శుభఫలితాన్ని ఇస్తుందంటారు. కాబట్టి అక్షయ తతీయ అంటే పెద్దవారు, ఉన్నవారి పండగే కాదు. ఇది పేదవారి పండగ కూడా.

అక్షయ తృతీయ నాడు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు చేసినా మంచి ఫలితం ఉంటుందని పార్వతమ్మవారికి శివుడు చెప్పాడని మత్స్యపురాణం చెబుతుంది. మరో ముఖ్య విషయం. ఈరోజున ఎలాంటి వర్జ్యాలు, దుర్ముహూర్తాలు ఉండవు. అంటే రోజు మొత్తంలో ఎప్పుడైనా ఎలాంటి శుభకార్యాలనైనా చేసుకోవచ్చు. త్రేతాయుగం మొదలైంది.. పరశురాముడు జన్మించింది.. బలరాముడు పుట్టినరోజు కూడా ఈరోజే. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు కృష్ణుడు అక్షయ పాత్రను ఈరోజే ఇచ్చాడంటారు. కుచేలుడు ఇచ్చిన గుప్పెడు అటుకులకు సంతోషించి అతడికి అష్టైశ్వర్యాలను కృష్ణుడు ప్రసాదించిందీ ఈరోజే. ద్రౌపదికి అక్షయంగా చీరలు ఇచ్చిందీ ఈ పర్వదినానే. వేదవ్యాసుడు భారతాన్ని రాయడం మొదలుపెట్టిందీ ఈరోజే. గంగ భూమిని చేరిందీ ఈరోజే. నంది పుట్టింది కూడా ఈ పర్వదినానే. దీనికి గుర్తుగా బసవ జయంతిని జరుపుతారు. సింహాచలంలో స్వామివారి నిజరూప దర్శనం లభించేది కూడా ఈరోజునే. బద్రీనాథ్ ఆలయాన్ని కూడా ఈరోజునే తెరుస్తారు.

అక్షయ తృతీయ రోజున సూర్యోదయానికి ముందే లేవండి. తలస్నానం చేయండి. విష్ణుమూర్తిని పూజించండి. శక్తిమేర దానధర్మాలు చేయండి. పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. భగవంతుడి కృపతో అష్టైశ్వర్యాలను పొందండి.