Latest

Manju Yanamadala : పదునైన అక్షరం.. పరిమళించే సాహిత్యం.. మంజు యనమదలకు కలమే బలం

Manju Yanamadala : తెలుగు అక్షరానికి తలకట్టు ఉంటుంది కదా.. అందుకే దానికి తలబిరుసు ఎక్కువనుకుంటారు. గుండ్రంగా ఉంటుంది కదా అందుకే అందంగా ఉంటుందని గర్వమెక్కువనుకుంటారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పొగుడుతారు కదా అందుకే దానికి పొగరు ఎక్కువని ఫీలవుతారు. ఇవన్నీ ఎక్కువే అయినా.. దానికి మంచి మనసు కూడా ఎక్కువే అన్న సంగతిని మర్చిపోకూడదు. అందుకే తనను ఎవరైతే ప్రేమించి, అభిమానించి, గౌరవిస్తారో వారి కలంలో ఒద్దికగా ఒదిగిపోతుంది. ఎవరైతే ఆప్యాయతను కనబరుస్తారో వాళ్ల చేతుల్లోంచి అక్షరామృత వర్షాన్ని కురిపిస్తుంది. ఎవరైతే గుండె గుడిలో చోటిస్తారో.. వారి జీవితంలో అక్షర వెన్నెలను ప్రసరిస్తుంది. ఇవన్నీ నేరుగా కంటికి కనిపించకపోవచ్చు కాని.. వాటన్నింటినీ తనలో ఇముడ్చుకున్న వారు రాసే అక్షరాలను చూస్తే మాత్రం.. నిజమే సుమీ అనిపిస్తుంది. అదీ తెలుగు అక్షరానికున్న శక్తి. అలాంటి అక్షరాలను రాసే యుక్తి.. మంజు యనమదల గారికి ఉంది. అక్షరాలను ఎలా కూర్చాలో.. ఏ వరసలో పేర్చాలో అన్న నేర్పరితనం మంజుగారికి ఉండబట్టే.. అవి ఇక్కడి కృష్ణా తీరం నుంచి అక్కడి సుదూరాన ఉన్న అమెరికా వరకు సాహిత్య పరిమళాలను వెదజల్లుతున్నాయి.

“అక్షరమెంత అనుభవశాలో_జీవితాల గెలుపోటములను సమంగా లిఖిస్తూ..!!”

అక్షరాలను ఎలా కూర్చాలో మంజుగారి కలానికి బాగా తెలుసు. వాటిని వాక్యంలో ఎలా పొందికగా పేర్చాలో ఇంకా బాగా తెలుసు. ఆ అక్షరానికి అవసరమైతే ప్రశ్నించడమూ వచ్చు. ఇదంతా కావాలనుకుంటే వచ్చేది కాదు. అందుకే ఆ అక్షరాలు సామాన్యులతో సైతం సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాయి. కులమతబేధాలు చూపకుండా అందరిలో కలిసిపోయాయి. ఇదే మంజు యమనదల కలానికి ఉన్న గొప్పదనం. ఈ అక్షర సేద్యం వెనుక చాలా ప్రయాణముంది. గతం అనే రెండక్షరాల గుండె లోతుల్లో మధురమైన జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, ప్రశంసలు, విమర్శలు ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నింటికీ మించి.. ఆ విధితో అనుక్షణం జరుపుతున్న పోరాటం ఉంది. అందుకే ఆమె గురించి తెలియాలంటే ముందు ఆమె రాసిన పుస్తకాలు చదవాలి. ఆమెతో మాట్లాడాలంటే ముందుగా ఆమె గతాన్ని తెలుసుకోవాలి. అసలు ఇదంతా మాకెందుకు అనుకుంటే కుదరదు. ఎందుకంటే జన్మనిచ్చిన అమ్మ గురించి.. జీవితాన్నిచ్చిన అక్షరం గురించి తెలుసుకునే అవకాశం చాలా తక్కువ సంద్భాల్లో దొరుకుతుంది. అలాంటి అమ్మ మనసున్న అక్షర ప్రేమికురాలే మంజు గారు.

“అక్షరాల అమరిక.. పదాల పొంతన.. తీరైన రచనగా మారుతుంది..!!”

అక్షరాస్త్రాలు సంధించే మంజు గారి గతాన్ని ఓసారి చూస్తే.. ఆమె కలానికి అంత పదును ఎలా వచ్చిందో తెలుస్తుంది. సాహిత్యంలో దిట్ట కాబట్టి.. తెలుగులో డిగ్రీలు, పీజీలు చేశారేమో అనుకుంటారు. కానీ ఆమె ఓ ఇంజనీర్. కాకపోతే తెలుగు తెగులును వదిలించి.. దాని తేజస్సును పెంచే ఇంజనీర్. పునాది బలంగా ఉంటేనే కదా.. ఎంత పెద్ద కట్టడమైనా నిలబడేది. అందుకే తన అక్షర సౌధంలో ఒక్కో మెట్టును చాలా జాగ్రత్తగా నిర్మించుకున్నారు. ఆ అక్షర ప్రయాణంలో రెండు నుంచి ఆరో తరగతి వరకు అవనిగడ్డలోని శిశువిద్యామందిరంలో విద్యాభ్యాసం సాగింది. ఏడు నుంచి ఇంటర్ వరకు విజయనగరం జిల్లా జొన్నవలసలో చదువుకున్నారు. స్కూల్లో ఉన్నన్నాళ్లూ ఎప్పుడూ టాపరే. ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశారు. ఆ తరువాత బళ్లారిలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ పూర్తయ్యింది. కాకపోతే విజయనగరంలో ఉన్నప్పటి నుంచి అవనిగడ్డలో ఫ్రెండ్స్ కు ఉత్తరాలు రాయడం అలవాటుగా ఉండేది. అప్పుడే ఆమెలో రచయిత్రి లక్షణాలు కనపడ్డాయి.

“వెతుకులాట తప్పనిసరి.. ప్రయోజనం లేదని తెలిసినా… ప్రాయోజితం కొందరికని తెలుసు..!!”

చెన్నైలో.. అంటే అప్పటి మద్రాసులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా రెండేళ్లపాటు పనిచేశారు. తరువాత బాబు పుట్టడంతో అస్సలు తీరికలేకుండా పోయింది. అందుకే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేశారు. కానీ రోజుకు రెండు గంటలపాటు లెక్చరర్ గా మాత్రమే చేస్తానని ముందే చెప్పేశారు. అలా ఆరు నెలల కాలం గడిచిపోయింది. తరువాత వేరే సాఫ్ట్ వేర్ కోర్సులు చేసి.. అమెరికా వెళ్లిపోయారు.

అమెరికాలో 8 ఏళ్లపాటు ఉద్యోగం చేశారు. తరువాత స్వదేశానికి వచ్చేయాలన్న ఉద్దేశంతో భారత్ లో అడుగుపెట్టారు. కానీ మంజు గారి సేవలను వదులుకోవడానికి ఇష్టపడని ఆ కంపెనీ.. మన దేశంలోనే ఆ ఉద్యోగాన్ని చేసుకోవాలని కోరింది. అలా హైదరాబాద్ లో అదే కంపెనీకి సేవలందించారు. ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం అంటే మాటలు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో తన అమ్మగారి కోసం ఉద్యోగం వదులుకోక తప్పలేదు. ఆ తరువాత పిల్లల చదువు కోసం ఓ మూడునాలుగేళ్లపాటు గుడివాడలో ఉండాల్సి వచ్చింది. తరువాత మళ్లీ ఫ్యామిలీని విజయవాడకు తీసుకుని వచ్చారు. ఈమధ్యలోనే ఓ ఏడాది పాటు ఓ కంపెనీకి ఆన్ లైన్ లో సేవలందించారు.

“బరువైనా భారమైనా  భరించాల్సిందే… బడబానలం మదిని చుట్టుమట్టినప్పుడు.. జీవితపు నిఘంటువుకి సాటిరావేవి..!!”

చదివిందేమో ఇంజనీరింగ్.. చేసిందేమో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. ఎక్కడా వీటికి, సాహిత్యానికి లంకె కుదరదు. అయినా సరే.. ఇష్టమున్న చోట కష్టమన్న మాటకు తావే ఉండదుగా. అందుకే పిల్లల్ని అమ్మ దగ్గర విడిచిపెట్టాక కాస్త వెసులుబాటు దొరికింది. పెద్దబాబుని ఏడాదిన్నర వయసులోనే వాళ్లమ్మగారి దగ్గర ఉంచితే.. చిన్నవాడిని మాత్రం ఆరు నెలలప్పుడే తీసుకువచ్చి.. ఇక్కడే ఓ నెల ఉండి.. తరువాత వాడి ఆలనాపాలనను చూడమని తన తల్లికి చెప్పారు. ఇక ఆ తరువాత అమెరికా ఉద్యోగంతో బిజీలైఫ్ తో సరిపోయింది.

చదువంటే ఇష్టం ఉన్నవారిని ఏ శక్తీ ఆపలేదు. అందులోనూ ఇష్టానికి, కష్టానికి అస్సలు పడదు. ఈ రెండూ బద్దశత్రువులుగా. అందుకే ఇష్టం వచ్చేసరికి కష్టం పారిపోయింది. లేకపోతే మంజుగారికి రెండో తరగతిలోనే సీరియల్ ను చదవాలన్న కోరిక ఎలా కలుగుతుంది? అంతకుముందు కూడా అమ్మ దగ్గర కూర్చుని బొమ్మల సీరియల్ ను ఆవిడతో చదివించుకుని మరీ స్కూల్ కి వెళ్లేవారు. నిజానికి ఇంతటి సాహిత్యాభిలాష ఆమెకు ఎలా వచ్చిందీ అంటే.. అంతా తండ్రి వారసత్వమే అని చెప్పాలి. ఆయనకు సాహిత్యం అంటే అంత ఇష్టం మరి. మరి ఆ అక్షర వారసత్వం ఎక్కడికి పోతుంది చెప్పండి?

చిన్నప్పుడే చందమామలు, బాలమిత్రలు చాలా ఎక్కువగా చదివేవారు. పీపుల్స్ ఎన్ కౌంటర్ మొదలు.. ఏదీ విడిచిపెట్టరు. అన్నీ చదివేస్తారు. అవనిగడ్డ లో స్కూలు టైమింగ్స్ అయిపోయిన వెంటనే.. పార్కు పక్కన ఉన్న లైబ్రరీలో ప్రత్యక్షమయ్యేవారు. అప్పట్లో శిశుమందిర్ స్కూల్లో చదువుకోవడంతో మూడో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అన్నీ నేర్చుకోవడానికి సాధ్యమైంది. ముందు రోజు బోర్డు మీద సంస్కృత శ్లోకం చెప్పేవారు. తరువాతిరోజు దాని అర్థం చెప్పాలి అనేవారు. అంటే ఇది మెదడుకు మేతే కదా. అలాగే అన్ని రకాల ప్రార్థనలు చేయించడంతో భక్తి కూడా కలిగింది.

“ఇరుకున పడినవి బంధాలు.. ఇబ్బంది పెడుతున్నది మనుష్యులు.. సమాజ జీవనం సహజ పంక్తి భోజనం..!!”

వేసవి కాలం వచ్చిందంటే.. స్కూళ్లకు సెలవు. ఇక అప్పుడు చూడాలి పిల్లల సరదా. ఈరోజుల్లో అంటే మొబైళ్లతో కుస్తీ పడుతున్నారు కానీ.. అప్పట్లో ఫోన్లే ఉండేవి కావు. అందుకే ఎంచక్కా అందరు పిల్లలూ కలిసి కథలు చెప్పుకునేవారు. ఆటలు, పాటలు, పద్యాలు, సామెతలు.. ఇలా అన్నింటితో రోజంతా ఎంతో సరదాగా గడిచిపోయేది. బొమ్మలు వేయడం కూడా అప్పుడే అలవాటైంది.

అప్పట్లో మంతెన నరసరాజు గారు మంజు నాన్నగారికి మంచి స్నేహితులు. నిజానికి ఆయన వల్లే.. మంజు.. అమెరికా వెళ్లగలిగారు. చుట్టాలు, బంధువులు కన్నా స్నేహితులే ఎప్పుడైనా నిండు మనసుతో ఆదుకుంటారని ఆమె నమ్మకం. కాకపోతే.. విజయనగరంలో ఉన్నప్పుడు మంజు నాన్నగారిని.. ఆయన స్నేహితుడు ఒకరు.. మోసం చేశారు. రొయ్యల కంపెనీ విషయంలోనూ ఆయన మోసపోయారు. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనివల్ల ఆమె ఇంజనీరింగ్ చదువు కూడా ఒక సంవత్సరం ఆగిపోయింది. తరువాత మళ్లీ కొన్నాళ్లకు ఆర్థిక సమస్యలు తీరిపోయాయి.

అమెరికా వెళ్లినా సరే.. మానవత్వాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. రోడ్డుపై పిల్లలను పారేశారు లాంటి వార్తలు విన్నప్పుడు, చూసినప్పుడు, చదివినప్పుడు ఆమె మనసు చాలా బాధపడేది. అందుకే ఎవరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. తానే బాధిత కుటుంబాలకు డబ్బును పంపించేవారు. ఓ ఇంజనీరింగ్ ఫ్రెండ్ ఇచ్చిన మంచి సలహాలు ఆమెకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఒకరికి మనం సహాయం చేస్తే.. వాళ్లు మరో పదిమందికి సాయపడతారు కదా అనుకునే మనస్తత్వం ఆమెది.

“శూన్యంలోనూ చిత్రాలే_జీవితంలో ఖాళీలను పూరించే ప్రయత్నంలో…!!”

తన సంపాదనలో కొంతభాగాన్ని అనాథ పిల్లల చదువులకు కేటాయిద్దామని అనుకున్నారు. ఇది 2006 నాటి మాట. కానీ అలా చేయడం వల్ల ఉపయోగం తక్కువని.. దానికి బదులు ట్రస్ట్ ని పెట్టి దాని ద్వారా సేవలందించమని మంజుగారికి అప్పటి ఆ జిల్లా కలెక్టర్ సలహా ఇచ్చారు. అప్పటికే చదువుల కోసం కొంతమందికి సహాయం చేసినా.. 2007 ఆగస్టులో ఇండియాకు వచ్చేసిన తరువాత ట్రస్ట్ గురించి ఆలోచించారు. ఊళ్లోనే ట్రస్ట్ పెడదామనుకుని తెలిసినవారిని సంప్రదించారు. ట్రస్ట్ కు తన భార్య పేరు పెట్టమంటూ ఓ వ్యక్తి పెద్ద మనసుతో కొంత మొత్తాన్ని అందించారు. తరువాత మంజుగారి స్నేహితులు తలా ఓ చేయి వేశారు. అలా ఏడు లక్షల రూపాయిలు పోగయ్యాయి.

నిజానికి 50 వేల రూపాయిలు సమకూరితే.. పిల్లల చదువులకు ఉపయోగపడతాయి అని మంజు అనుకున్నారు. కానీ సంకల్పం మంచిదైతే.. సహాయం చేసేవారు వెదుక్కుంటూ వస్తారు. సత్ఫలితాలు అవే వస్తాయి. అందుకే ఇంతమొత్తం సమకూరింది. ఇందులో దాదాపు ఆరు లక్షల రూపాయిలను డిపాజిట్ చేశారు. ఏటా పిల్లల చదువుల కోసం సహాయం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నా సరే ట్రస్ట్ బాధ్యతను మాత్రం మర్చిపోలేదు. కానీ ఎక్కువమందికి దీనిని చేరువ చేయడానికి.. ఉచితంగా దాని గురించి రాయడానికి బ్లాగును ప్రారంభించారు. అలా జనం ముందుకు వచ్చిందే.. ‘కబుర్లు-కాకరకాయలు’ అనే బ్లాగు. ఇక అప్పటి నుంచి ఆమె కలం వేగం పెరిగింది. ఎక్కడా ఆగలేదు.

ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కోరడంతో ఫేస్ బుక్ లో ఖాతా తెరిచారు. బ్లాగులో రాసినదానిని అందులోనూ పోస్ట్ చేసేవారు. కవిత్వం గ్రూపుల్లో జాయిన్ అవ్వడంతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో రాతలు మరింతగా మెరుగుపడ్డాయి. అలా అని పరిశోధించి రాసేంత తీరిక ఉండేది కాదు. అందుకే ఆమె మనుసుకు అనిపించింది రాసేవారు. అలా రాసింది తనకు నచ్చిందా లేదా అనేదే ప్రధానంగా చూసేవారు. నిజానికి మంజు ఇలా రాస్తారని ఆమె ఇంట్లోవారికి కూడా తెలియదు. అందుకే వాళ్లు చూస్తే.. ఎక్కడ వద్దంటారో అని గబగబా రాసేసేవారు. అయినా ఆ సాహిత్యం పరిమళాలు వెదజల్లకుండా ఉంటుందా.. దానిని ఆపడం ఎవరతరం చెప్పండి!

“నిజాన్ని అస్సలు తట్టుకోలేడు_బతుకంతా అబద్ధంలో బతికేవాడు…!!”

మంజుగారి రచనలను చూసిన కొన్ని సాహితీసేవ గ్రూపులు.. మరింతగా రాయమని కోరాయి. కానీ తన స్టైల్ లో మాత్రమే రాస్తానని.. అలా అయితేనే ఓకే చెబుతానని ఆమె అన్నారు. దానికి వాళ్లు కూడా సరే అనడంతో ‘తెలుగు సాహితీ ముచ్చట్లు’ పేరుతో మరో ప్రయాణం మొదలైంది. వేరే గ్రూపుల్లో చిన్న చిన్న కవిత్వాలు రాసేవారు. తరువాత ఆరోగ్యం సహకరించలేదు. ఓసారి మూడు గంటలపాటు బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఏమయ్యిందో ఏమో అని డాక్టర్ కు చూపించుకోవడానికి విజయవాడ వెళ్లారు. ఆ తరువాత కొన్ని మెడిసిన్స్ వాడడంతో కోలుకున్నారు. అటుపై అమెరికా కంపెనీ కోసం పనిచేశారు కూడా. కాకపోతే నైట్ షిఫ్టుల్లో పనిచేయాల్సి రావడం, అప్పటికే వాడుతున్న మెడిసిన్స్ వల్ల ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చాయి.

మంజుగారి ఆరోగ్యం బాగాలేకపోవడంతో అమెరికాలో ఉన్న ఆమె డాక్టర్ అన్నయ్య.. ఇక్కడికి వచ్చి వైద్యులకు చూపించారు. ఆర్థరైటిస్ అనుకున్నారు. మెడిసిన్స్ వాడుతున్నా సరే.. ప్లేట్ లెట్లు డౌన్ అయిపోయాయి. అనారోగ్యం దృష్ట్యా స్టెరాయిడ్స్ వాడక తప్పలేదు. దీనివల్ల రాషెస్ రావడం, జుట్టు ఊడిపోవడం.. ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఆమె కలం ఆగలేదు. సాహిత్య ప్రయాణం ఆపలేదు. అప్పటికే 500 నుంచి 600 కవితలు రాసుంటారు. వాటితో పుస్తకం వేయమని అందరూ అడిగారు. దాదాపు 130 కవితలతో .. ‘అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు’ అన్న పేరుతో పుస్తకం వేశారు. ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఓ వ్యక్తి.. పుస్తకాలు అచ్చు వేయడానికి తాను డబ్బులు ఇస్తానని చెప్పారు. ఇక్కడ వాళ్లు చేసే ఆర్థిక సహాయం అనేది ముఖ్యం కాదు.. వాళ్లు డబ్బు ఖర్చుపెట్టి మరీ పుస్తకం అచ్చు వేయిస్తామన్నారంటే ఆమె రచనలు వారిని ఎంతగా ఆకట్టుకున్నాయో, ఎంతగా ప్రభావితం చేశాయో అనే మంచి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా ఎందరో సాహిత్యాభిమానులు.. మంజుగారి కవితలను, రాతలను ఎంతోగానో ఇష్టపడుతున్నారు.. అభిమానిస్తున్నారు.

మంజుగారి ఆర్టికల్స్ ను, రాజకీయ విశ్లేషణలను చదివిన చాలామంది.. కథలు కూడా రాయమని అడిగేవారు. తరువాత ఆమె రెండో పుస్తకాన్ని ఓపెన్ చేశారు. దానిని ఫేస్ బుక్ లో పరిచయం చేశారు. దాని పేరు ‘సడిచేయని (అ)ముద్రతాక్షరాలు’. ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కోరడంతో తన కవితలతో మూడో పుస్తకాన్ని అచ్చు వేయించారు. ఫేస్ బుక్ లో మరో ఫ్రెండ్ తో కలిసి నాలుగో పుస్తకాన్ని ప్రింట్ చేయించారు. రెండో పుస్తకానికి ఆర్థిక దన్నునిచ్చిన రామకృష్ణగారే.. నాలుగో పుస్తకాన్ని అచ్చువేయించే బాధ్యతను తీసుకున్నారు. ఇక ఐదో పుస్తకంగా వచ్చిన ‘అంతర్లోచనాలు’ ను ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది.

కల(ల)వరాలన్నీ

కలబోసుకున్నాయి

మరలిన కాలాన్ని

మార్చలేమంటూ

మౌనం గమ్యానికి

మార్గాన్ని చూపెడుతుందొక్కోసారి..!!

నవ మల్లెతీగ మాస పత్రికకు ‘జీవన మంజూష’ పేరుతో నెలకోసారి వ్యాసాలు రాసేవారు. జీవన మంజూషగా రాసిన వ్యాసాలన్నీ తరువాత పుస్తకంగా వేసే ఆలోచన కూడా ఉంది. గోదావరి పేపర్ లో పుస్తకాలకు సమీక్షలు రాస్తారు. చాలా వెబ్ సైట్ల వాళ్లు అడగడంతో కాదనలేక.. వారి కోసం కూడా రాసిచ్చారు. పత్రికలు అడిగినంత కాలం రాసేవారు. తరువాత సన్మానాలు, సత్కారాలు చేస్తామని కవితాలయంతోపాటు చాలామంది అడిగారు. కానీ ఆమె ఒప్పుకోలేదు.

అనారోగ్యం వల్ల మంజుగారికి అస్సలు బయటకు వెళ్లడం సాధ్యమయ్యేది కాదు. కానీ ఆమె కలం ప్రయాణం మాత్రం ఆగలేదు. దశదిశలా తన ఖ్యాతిని చాటుతూనే ఉంది. కవితాలయం వాళ్లు శీర్షికలు రాయమన్నారు. సాహిత్యం గురించి రాయమన్నారు. అందుకే వాటితోపాటు తన జీవితం గురించి కూడా రాస్తున్నారు. అంతకుముందు రాజశేఖర్ గారనే వ్యక్తి.. ఓ వెబ్ సైట్ లో అమెరికా విశేషాలు రాయమన్నారు. అలాగే రాశారు. ఓసారి ఓ పెద్దాయన రాత్రి సమయంలో మెసేజ్ పెట్టారు. తరువాతి రోజు కాల్ చేస్తే అభినందించారు. ఆయన కూడా చాలా మంచి రచయిత. అందుకే తనను కూడా నవలలు రాయమన్నారు. కానీ మంజూ గారు ఒప్పుకోలేదు. అనిపించింది రాసుకుంటూ వెళ్లిపోవడమే ఆమెకు ఇష్టం.

మంజూగారి పుస్తకాలు చదివిన డాక్టర్ లక్ష్మీ రాఘవ.. ఒక్క మాట మాత్రం చెబుతారు. ఏ ప్రశ్నకైనా.. మంజు రాసిన రాతల్లో సమాధానం దొరుకుతుంది అని. మంజూగారి రచనలమీద ఆమెకున్న నమ్మకం అలాంటిది. అలా మంజూగారికి ఎంతోమందితో అక్షరానుబంధం ఏర్పడింది. తనకు ఉత్తరాలు రాసినవారికి కచ్చితంగా రిప్లయ్ ఇస్తారు. అందుకే వాళ్లు కూడా సంతోషపడతారు. ప్రత్యక్షంగా చదివేవారు తక్కువ. పరోక్షంగా చదివేవారు ఎక్కువ. అయినా వాళ్లు కూడా బాగుందంటారు. దీంతో ‘కాలం వెంబడి కలం’.. పేరుతో కొన్ని పదుల వారాలుగా రాస్తున్నారు. ఈ కాలం వెంబడి కలం కూడా పుస్తకంగా రాబోతుందని ఆమె చెప్పిన మాటలు.. సాహిత్యాభిలాషులకు సంతోషకరమైన విషయమే. ఇప్పుడు రెక్కలు అనే సాహిత్య ప్రక్రియను ముగ్గురు కలిసి చేస్తున్నారు.

వెలుతురుకై

వెతుకులాట

చీకటి చుట్టానికి

అక్షరాల తోవ చూపిస్తూ

మనసు

నిరంతరాన్వేషి..!!

అనారోగ్యం వల్ల చాలా రకాల మందులు వేసుకోవాలి. అయినా ఇంతలా ఎలా రాయగలుగుతున్నారని.. ఆమె గురించి తెలిసినవాళ్లు అడుగుతారు. ట్యాబ్లెట్స్ మానేస్తే కష్టం. ఒకవేళ దాని డోస్ చాలలేదంటే.. మళ్లీ ఇంజక్షన్ వేసుకోవాల్సిందే. ఎండలో ఉండలేరు. లైటింగ్ పడదు. వేడి తగిలినా అంతే. ఓ సందర్భంలో మూడు నెలలపాటు గదిలోనే ఉండాల్సి వచ్చింది. కనీసం లేవలేని పరిస్థితి. ఎముకల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. కానీ రాసినంతసేపు అసలు అనారోగ్యమే గుర్తుకురాదు. అక్షరం అంటే ఆమెకు అంత ప్రేమ. అందుకే అనారోగ్యాన్ని కూడా అది ఇన్నాళ్లుగా జయిస్తూనే ఉంది.

ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే మంజు గారు.. అదరలేదు. బెదరలేదు. మనోనిబ్బరంతోనే మళ్లీ కోలుకున్నారు. రాస్తానంటే ఆమె అమ్మ, అమ్మమ్మ ఒప్పుకునేవారు కాదు. ఎక్కడ ఆమె మళ్లీ అనారోగ్యం పాలవుతారో అని వారి బెంగ. అయినా సరే వారు చూడకుండా.. ల్యాప్ టాప్ ఓపెన్ చేసి రాసేవారు. కానీ ఆ తరువాత.. ఆమె ఎలా సంతోషంగా ఉంటారో.. అలాగే ఉండనివ్వండి అని డాక్టర్ చెప్పడంతో… రాసుకోవడానికి కుటుంబ సభ్యులు కూడా వెసులుబాటు ఇచ్చారు.

సాహిత్యం మీదున్న ప్రేమతో సాహితీసేవ గ్రూపులో ముఖాముఖి పెట్టేవారు. దాని కోసం చాలా పని ఉండేది. వారానికి నాలుగైదు రోజుల పాటు పనిచేసేవారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నాళ్ల తరువాత ఇలాంటి గ్రూపులకు పనిచేయలేకపోయారు. ఇప్పటికే ఏడు పుస్తకాలను అచ్చువేయించారు. కానీ వాటిలో దేనినీ అమ్మలేదు. ఆమె అక్షరాలను అభిమానించేవారే.. మంజుగారి అనుమతి తీసుకుని వాటిని అచ్చువేయించేవారు. వాటిలో ఏ’కాంత’ అక్షరాలు అనే పుస్తకం కూడా ఉంది. ఇక చివరిగా అచ్చయిన పుస్తకం పేరు అక్షర స(వి)న్యాసం.

శూన్యంలో

అన్వేషణ మెుదలు

యుద్ధానికి

సిద్దమైన మనసుతో

మనిషి ఆరాటం ఎందుకన్న

ప్రశ్నకి అంకురం వెదుకుతూ..!!

కథ కావాలని అడిగితే.. కచ్చితంగా ఇచ్చేవారు. ఒక సినిమాకు కథ రాశారు. మరో సినిమాకు పెళ్లి సీన్ కూడా రాశారు. ఇక మంజూగారికి సినిమా పాటలు పాడడం అన్నా.. బొమ్మలు వేయడమన్నా చాలా ఇష్టం. నిజానికి ఇలాంటి వ్యాపకాల వల్ల మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. అది మరింతగా రాయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కలం పదును పెరగాలంటే.. రచయిత మనసు ప్రశాంతంగా అయినా ఉండాలి.. ఆవేశంగా అయినా ఉండాలిగా.

ఆమధ్య ఒకసారి మంజుగారు ప్రయాణిస్తున్న స్కార్పియో యాక్సిడెంట్ కు గురైంది. ఆ సమయంలో మంజు గారు డ్రైవర్ సీటు పక్కనే కూర్చున్నారు. కానీ ఆ ఘటనలో ఆమెకు ఏమీ కాలేదు. ఆ క్షణాన మంజుగారు అనుకున్నది ఒక్కటే.. దేవుడికి మనతో ఏదైనా పని ఉండాలి.. లేదంటే.. మనతో ఏదైనా పని చేయించాలని భావించి ఉండొచ్చు. అందుకే తన ప్రాణాన్ని కాపాడాడు అని భావించారు. ఇంతటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నా సరే.. ఆమె ఏమాత్రం భయపడలేదు. తన కలం ప్రయాణాన్ని ఆపలేదు.

మంజుగారికి సామాజిక చైతన్యం ఎక్కువ. అందుకే ఎక్కడైనా సమస్యలుంటే వాటిపై పోరాడి.. బాధితులకు న్యాయం చేయాలనుకుంటారు. ఈ క్రమంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినా వెనక్కు తగ్గలేదు. చివరకు చెడుపై మంచే విజయం సాధించింది. అంటే.. అటు అక్షరాలతో సామాజిక స్పృహను పెంచుతూనే.. ఇటు తనవంతుగా సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కృష్ణమ్మ అలల చప్పుడు చెబుతుంది.. మంజు గారి కలం నుంచి వచ్చే అక్షరాల సవ్వడి ఎంత శ్రావ్యంగా ఉంటుందో. అందుకే మంజూ గారు ఇంకా మరిన్ని మంచి రచనలు చేయాలని.. మరింతమందికి స్ఫూర్తిగా నిలవాలని సిరిమల్లి.కాం (sirimalli.com) మనసారా కోరుకుంటోంది.

Also Read :

h2o : పడమటి లతా రాగం.. కష్టాల్లో ఉన్నవారికి H2Oతో స్నేహ హస్తం

Inspirational Story : బంగాళాదుంప, కోడిగుడ్డు, కాఫీ గింజల కథ వింటే మీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది..

Motivational Story : కరోనా భయం పోవడానికి తొండ, పాము కథే బెస్ట్ మెడిసిన్

Immune Food : ఏ టైమ్ లో ఏం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. 40 ఏళ్లు దాటినా..

Satya Nadella : ఆ ఐదు అంశాలే.. మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ సత్యనాదెళ్ల జీవితాన్ని మార్చేశాయి

Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

For More Updates Follow us on – Sirimalli Page

admin

Recent Posts

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు ( 18 -01-2024)

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు ( 18 -01-2024)   SREE KRUPA పంచాంగం - 18…

2 months ago

Today Horoscope: ఆ రాశి వారికి నూతన వాహన యోగం! (05-01-2024)

Today Horoscope: ఆ రాశి వారికి నూతన వాహన యోగం! (05-01-2024) SREE KRUPA *(05-01-2024) రాశి ఫలితాలు  …

3 months ago

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు ( 05-01-2024)

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు ( 05-01-2024) SREE KRUPA *పంచాంగం - 05 జనవరి 2024…

3 months ago

Today Horoscope: ఆ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు (04-01-2024)

Today Horoscope: ఆ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు (04-01-2024) SREE KRUPA (04-01-2024) రాశి ఫలితాలు మేషం  వృత్తి…

3 months ago

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు ( 04-01-2024)

Panchangam Today : ఈరోజు సుముహూర్త సమయాలు ( 04-01-2024) SREE KRUPA *పంచాంగం - 04 జనవరి 2024…

3 months ago

Today Horoscope: ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభం! ( 03-01-2024)

Today Horoscope: ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభం! ( 03-01-2024) SREE KRUPA (03-01-2024) రాశి ఫలితాలు మేషం నూతన…

3 months ago