Life Style

మొటిమలను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను ఇలా ట్రై చేశారా?

అందమంతా కనిపించేది ముఖంలోనే. ముఖవర్ఛస్సు ఎంత బాగుంటే.. అంత సౌందర్యం కనిపిస్తుంది. కాని ఒక్కసారి మొటిమలు వచ్చాయంటే ఒకపట్టాన తగ్గవు. కొంతమందికి వచ్చిన కొద్దిరోజులకు తగ్గిపోతాయి. మరికొంతమందికి మాత్రం వస్తూ పోతూ ఉంటాయి. కాని వీటిని తగ్గించుకోవడానికి చాలామంది చాలా రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తుంటారు. చాలా పద్దతులను ఫాలో అవుతారు. వీటిని తొలగించుకోవడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి.

తలలో చుండ్రు వల్ల..
తలలో ఉండే చుండ్రు వల్ల కూడా మొటిమలు వస్తాయని మీకు తెలుసా? కాని ఇది నిజం. అందుకే ఆ చుండ్రు ఏ స్థాయిలో ఉందో గమనించాలి. దానిని బట్టి మీ జుట్టు తత్వానికి సరిపడే యాంటీ డాండ్రూఫ్ షాంపూను ఉపయోగించాలి. డాండ్రఫ్ ఎంత తగ్గితే.. అంతగా మీ మొటిమలను తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది

ఈ ఆయిల్ తో ఉపయోగం..
టీ ట్రీ ఆయిల్ లో బ్యాక్టీరియాను చంపేసే గుణముంది. అందుకే ఈ ఆయిల్ ని మొటిమలపై రాస్తుంటే.. కొద్దిరోజుల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది. కాని రిజల్ట్ రావడానికి కాస్త సమయం పడుతుంది. ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయంటున్నారు నిపుణులు.

యాపిల్ సైడ్ వెనిగర్ ట్రై చేశారా?
యాపిల్ సైడ్ వెనిగర్ ను ఒక భాగం తీసుకుంటే.. దానికి 3 భాగాల నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పూట పడుకునే ముందు మొటిమలపై రాసుకోవాలి. తరువాతి రోజు ఉదయాన్నే కడిగేయాలి. ఆ తరువాత మాయిశ్చరైజర్ ను అప్లయ్ చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల కొంతమేర ఫలితం కనిపిస్తుంది.

దాల్చిన చెక్క, తేనెను ఉపయోగించారా?
తేనెను రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి. దాల్చి చెక్క పొడిని ఒక టీ స్పూన్ తీసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. దీనిని ముఖానికి పట్టించాక.. పది లేదా 15 నిమిషాల పాటు వేచి ఉండాలి. ఆ తరువాత దీనిని కడిగేయాలి. దీనివల్ల కూడా మీకు ఫలితం కనిపిస్తుంది.

అరటి తొక్కే కదా అని తీసిపారేయకండి. దీంతో కూడా..
అరటి పండు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. దాని తొక్క వల్ల కూడా అన్నే బెనిఫిట్స్ ఉంటాయి. తొక్కలోది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే.. ఆ అరటిపండు తొక్కతో కూడా మొటిమలు తగ్గించుకోవచ్చు. అరటిపండు తొక్కలోపలి భాగంతో ముఖంపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. తరువాత ఓ అరగంట పాటు వెయిట్ చేయండి. ఆ తరువాత ముఖాన్ని కడిగేయండి. మొటిమలు తగ్గడానికి అ బనానా ప్యాక్ కూడా ఉపయోగపడుతుంది. ముఖం కూడా బ్రైట్ గా కనిపిస్తుంది.