Off Beat

తినేకొద్దీ తినాలనిపించే తీపి.. కమ్మనైన అటుకుల బర్ఫీ (ఒక్కసారి రుచి చూడండి)

లడ్డూ, బాదుషా, కాజా, గులాబ్ జామూన్, మైసూర్ పాక్.. ఇవన్నీ తెలుగువారి స్వీట్లే. పక్క రాష్ట్రాల స్వీట్లలో కొన్నింటిని కూడా మన మధుర పదార్థాలుగా చేసేశాం. అంటే వాటిపై అంత ప్రేమ మరి మనవాళ్లకు. చాలామంది చాలా రకాల స్వీట్లు తింటారు కాని.. వాటిలో బర్ఫీ రుచే వేరు. ఇలా నోటిలో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. తీయగా, రుచిగా ఉండడంతో పాటు తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ ఇది. పైగా కొద్దిమొత్తంలో చేసి పెట్టుకుంటే.. చుట్టాలు, స్నేహితులు, బంధువులు, అతిథులు ఎవరు వచ్చినా వెంటనే వారికి స్నాక్స్ కింద అందించవచ్చు.

అంటే రెడీమేడ్ స్వీట్ అన్నమాట. సరిగా చేయాలే కాని కొద్దిరోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. అందుకే చాలామంది గృహిణులు.. వీటిని ఖాళీ సమయాల్లో చేసి నిల్వ పెట్టుకుంటారు. కొంతమంది మాత్రం సెలవు రోజుల్లో చేసుకుని.. ఓ పట్టు పట్టేస్తారు. ఎవరిష్టం వారిది. ఎక్కడికైనా వెళ్లినా తమ వెంట ఈజీగా తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది. అందుకే ఎక్కువమంది దీనిని ఇష్టపడతారు. చాలామంది చాలా రకాల బర్ఫీలు తిని ఉండొచ్చు. కాని అటుకుల బర్ఫీని రుచి చూసినవాళ్లు మాత్రం దాని టేస్ట్ ని అస్సలు మర్చిపోరు. మరి దీనిని ఎలా తయారు చేయాలంటే..

అటుకుల బర్ఫీకి కావలసిన పదార్థాలు
అటుకులు – ఒక కప్పు
గోరువెచ్చని పాలు – పావు కప్పు
చక్కెర (పంచదార) – ఒక కప్పు
నెయ్యి – పావు కప్పు
కోవా – ఒక కప్పు
బాదం పలుకులు – కాసిన్ని (మీకు కావల్సినన్ని)
యాలకుల పొడి – ఒక చెంచా

అటుకుల బర్ఫీ తయారుచేసే విధానం
ముందుగా అటుకుల్ని ఓ ఐదు నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టండి. ఆ తరువాత ఆ అటుకులను గట్టిగా పిండండి. నీరు పోయిన తరువాత మిక్సీ జారులో వేయండి. వాటిని మెత్తని ముద్దలా చేసుకోండి. తరువాత ఓ గిన్నెలోకి తీసుకోండి. అడుగు మందంగా ఉన్న మరో గిన్నెను తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అందులో వేసి కరిగించండి. అందులో కోవా వేయండి. ఆ కోవా కాస్త వేగిన తరువాత.. చక్కెర, యాలకులపొడి, అటుకుల ముద్ద, పాలూ పోయండి. తరువాత మంట తగ్గించండి. ఈ మిశ్రమాన్ని మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి. కొద్దిసేపటి తరువాత ఇవన్నీ కలిసి దగ్గరగా వచ్చినట్టు అవుతుంది. అలా అయ్యాక.. సౌ మీద నుంచి దింపేయండి. ఓ పళ్లెమును తీసుకుని అందులో నెయ్యి రాయండి. తరువాత గిన్నెలో ఉన్న ఆ మిశ్రమాన్ని పళ్లెంలోకి తీసుకోండి. ఇంకేముంది మీకు నచ్చిన షేపులో దానిని ముక్కలుగా కట్ చేయండి. అందంగా కనిపించడంతో పాటు ఆరోగ్యం కోసం.. ఆ ముక్కలపైన బాదం పలుకులను అలంకరించండి. ఈ పనంతా అయ్యాక.. దానిని తీసుకెళ్లి ఫ్రిజ్ లో ఓ గంట సేపు ఉంచండి. ఆ తరువాత తీసి దాని రుచి చూడండి.