Off Beat

పిల్లలు ఇష్టంగా తినే, నోరూరించే బ్రెడ్ ఉప్మా.. దీని తయారీ ఎలా చెప్మా?

అనుకుంటాం కాని చిరుతిళ్లను ఆరోగ్యకరంగా చేసుకుంటే అంతకన్నా కావలసింది ఏముంది? పొట్ట నిండుగా భోజనం చేసినా సరే.. కాసేపయ్యాక మళ్లీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. తెలుగువారికుండే జిహ్వ చాప్యం అలాంటిది. వయసులో ఉన్నా, వృద్ధాప్యమొచ్చినా సరే.. ఏదో ఒకటి నోటిలో ఆడాల్సిందే. లేకపోతే మనసూరుకోదు.. కడుపాగదు. అందుకే చాలామంది బజార్లో దొరికే ఏవో ఒక చిరుతిళ్లను తెచ్చేసుకుంటారు. డబ్బులు పెడితే వెరైటీలు దొరుకుతాయి కాని పోషకాలతో కూడిన అల్పాహారం వస్తుందా? అందుకే టిఫిన్ కిందైనా, స్నాక్స్ కిందైనా సరే.. హాయిగా తినగలిగే అల్పాహారాల్లో ఒకటి.. బ్రెడ్ ఉప్మా.

గోధుమనూకతోనో, ఇడ్లీరవ్వతోనో చాలామంది ఉప్మా చేస్తారు. అర్జంట్ గా అయిపోయే టిఫిన్లలో ఇదొకటి. అందుకే చాలామంది మహారాణులు.. ఎక్కువమంది చుట్టాలు ఒకేసారి వచ్చినా భయపడరు. కారణం.. వారి చేతిలో చిటికెలో ఉప్మా చేసే విద్య ఉంది కనుక. అలాంటివాళ్లు ఇప్పుడీ బ్రెడ్ ఉప్మా కూడా ఎలా చేయాలో ఓసారి నేర్చేసుకుంటే ఓ పనైపోతుంది. శ్రీవారితో పాటు పిల్లలకు, ఇంట్లో ఉన్న అందరికీ మీ అద్భుతమైన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపించినట్లు అవుతుంది. అన్నట్టు.. ఇందులో పోషకాలు కూడా తక్కువేం కాదు. కాబట్టి హ్యాపీగా చేయచ్చు. కడుపునిండా తినొచ్చు.

బ్రెడ్ ఉప్మా తయారీకి ఉపయోగించే పదార్థాలన్నీ వంటింటి దినుసులే. కనుక ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటివి ఏవీ ఉండవు. దీనివల్ల ఆరోగ్యం చెడిపోతుందనే భయం అక్కర్లేదు.

బ్రెడ్ ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు (స్లైస్ లు) – 5
ఉల్లిపాయ – 1
టొమాటో – 1
పచ్చిమిర్చి – 2
తరిగిన అల్లం – కొంచెం
పసుపు – చిటికెడు
సాంబార్ పొడి – ఒక చెంచా
నెయ్యి – 4 చెంచాలు
ఉప్పు – రుచికి తగినంత
ఆవాలు – అర చెంచా
సెనగపప్పు – అరచెంచా

బ్రెడ్ ఉప్మా తయారుచేసే విధానం
బ్రెడ్ స్లైసుల్ని తీసుకుని వాటిని ముక్కలుగా చేయాలి. అంటే మీకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. తరువాత బాణలిలో 2 చెంచాల నెయ్యిని వేయాలి. దానిని పొయ్యిమీద పెట్టాలి. నెయ్యి పూర్తిగా కరిగిపోయాక అందులో బ్రెడ్ ముక్కల్ని వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే బాణలిలో మరో రెండు చెంచాల నెయ్యి వేయాలి. అది పూర్తిగా కరిగాక.. ముందుగానే సిద్ధం చేసుకున్న ఆవాలు, సెనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, కరివేపాకును అందులో వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక.. అందులో టొమాటో ముక్కలు, పసుపూ, సాంబార్ పొడిని, ఉప్పును వేసి మంట తగ్గించండి. టొమాటోలు మెత్తగా అయ్యాయో లేదో చూడండి. అవి మెత్తగా అయ్యాక.. బ్రెడ్ ముక్కల్ని వాటిలో వేసి కలపండి. రెండు మూడు నిమిషాలు అలా ఉంచి.. తరువాత స్టౌ ఆఫ్ చేయండి. దీంతో వేడి వేడి బ్రెడ్ ఉప్మా రెడీ! ప్రేమతో పెద్దలకు, శ్రీవారికి, పిల్లలకు వడ్డించండి.