Off Beat

భోజనమైనా, టిఫినైనా అటుకుల వడియాలు లేనిదే రుచెక్కడ?

చాలామందికి భోజనం అంటే కేవలం అన్నం, పులుసు, రసం, సాంబారు, ఏవో రెండు రకాల కూరలు ఉంటే సరిపోదు. పోనీ పచ్చళ్లతో అయినా టేస్ట్ చూస్తారా అంటే కొంతమంది మూతి ముడిచేస్తారు. అలాంటివాళ్లకు అప్పడం, వడియాలు వంటివి అందిస్తే.. వాళ్ల ముఖం వెలిగిపోతుంది. లేకపోతే ముద్ద దిగదు కదా. అందుకే అలాంటివాళ్ల కోసం రకరకాల వడియాలను కనిపెట్టారు మన తెలుగువాళ్లు. అలాంటివాటిలో అటుకులు వడియాలు కూడా ఉన్నాయండోయ్. అటుకుల వడియాలు అంటే కేవలం అటుకులు మాత్రమే ఉండవు. ఇందులో అన్ని రకాల పోషకాలు కలిగిన ఇతర దినుసులు, పోషక విలువలు కలిగిన కొత్తిమీర వంటివాటిని కలపాల్సిందే. అప్పుడే కదా.. రుచికి రుచి, శక్తికి శక్తి, పోషకాలకు పోషకాలు. ఇంటిపట్టున చేసుకునే వడియాల వల్ల బయటి ఫుడ్ తినే బాధ తప్పుతుంది. దీని వల్ల ఆరోగ్యానికి మంచిదే కదా. చాలామంది వడియాలు పెట్టమంటే.. అబ్బా! వడియాలా అని వగలుపోతారు కాని సరైన మోతాదులో అన్ని వస్తువులను కలిపి పెట్టాలే కాని.. నలభీమ పాకానికి ఇదేం తీసిపోతుంది చెప్పండి.
అటుకుల వడియాలకు ముందుగా మీరు కొన్ని వస్తువులను సమకూర్చుకోవాలి.

కావలసిన పదార్థాలు
——————
పెసరపప్పు – పావుకేజీ (1/4)
అటుకులు – అరకేజీ (1/2)
జీలకర్ర – 4 చెంచాలు
మిర్చి – 10
నువ్వులు – 5 చెంచాలు
కొత్తిమీర – ఒక కట్ట
ఉప్పు – 4 చెంచాలు

పై వస్తువులు అన్నింటినీ ఒక దగ్గర సమకూర్చుకున్నాక ఇక వడియాలు పెట్టడానికి సిద్ధమైతే చాలు.

అటుకుల వడియాల తయారీ విధానం
———————–
1. పెసరపప్పును రెండు గంటల పాటు నానబెట్టాలి
2. రెండు గంటల పాటు నానిన పెసరపప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి
3. అటుకులను నీళ్లలో వేయాలి. వాటిని తీసి ఓ పక్కన పెట్టుకోండి.
4. పెసరపిండిలో పచ్చిమిర్చి ముక్కలను, జీలకర్రను, కొత్తిమీర తరుగును, నువ్వులను కలపండి. మీ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేయండి.
5. తడిపిన అటుకులను బాగా పిండి.. పెసరపిండిలో అన్నీ వేసి తయారుచేసుకున్న మిశ్రమంలో కలపాలి. అంటే అటుకుల వడియాల పిండి సిద్ధమైనట్టే.
6. ఓ తడి వస్త్రాన్ని తీసుకోవాలి.
7. తడి వస్త్రం మీద వడియాలను పెట్టుకోవాలి. బాగా ఎండిపోయాక వాటిని తీసేయాలి. గాలి చొరబడని మంచి డబ్బాలో నిలవ చేసుకుంటే సరిపోతుంది.