Life Style

జుట్టు రాలే సమస్య తగ్గడానికి 2 పద్దతులు.. మరికొన్ని చిట్కాలు

మగువకు అందాన్నిచ్చేది కురులే. అవి పట్టులా ఉంటే అంతకన్నా కావలసింది ఇంకేముంది. కాని ఈమధ్యకాలంలో రకరకాల కారణాల వల్ల జుట్టు రాలిపోయే సమస్య పెరిగిపోయింది. దానిని తగ్గించడానికి చాలామంది చాలా రకాల షాంపూలు, ఆయిల్స్ వాడతారు. కాని మీ జుట్టు తత్వాన్ని బట్టి ఏది మంచిదో దానిని మాత్రమే అప్లయ్ చేయాలి. దానికోసం కొన్ని పద్దతులు ఉన్నాయి.

హెయిర్ ఫాల్ ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకునేదెలా?
జుట్టు పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా ఊడకుండా ఉంటే చాలు.. అదే పదివేలు అనుకునే కాలమిది. పొడుగాటి జడలు వేసుకోవాలని చాలామందికి ఉన్నా హెయిర్ ఫాల్ సమస్యతో ఆ కోరికను చంపుకోవాల్సి వస్తోంది. అసలు మీకు జుట్టు రాలే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే ఒకటే చిట్కా. తల దువ్వుకునే సమయంలో మీ దువ్వెనకు కొన్ని వెంట్రుకలు అతుక్కుపోతాయి. దానిని బట్టి మీ జుట్టురాలే సమస్య తాలూకా స్థాయిని అంచనా వేయచ్చు. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.

జుట్టు రాలకుండా ఉండాలంటే..
చిట్కా 1 – 500 మిల్లీ లీటర్ల కొబ్బరి నూనెలో 100 గ్రాముల ఉసిరికాయ ముక్కల్ని వేసి 20 నిమిషాల పాటు ఉడికించండి. తరువాత ఆయిల్ లో ఉన్న ఉసిరికాయ ముక్కల్ని తీసేయాలి. అప్పుడా ఆయిల్ ను చల్లగా ఉండే చోట ఉంచాలి. దీనిని జుట్టుకు మసాజ్ రూపంలో నెమ్మదిగా అప్లయ్ చేయడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించుకోవచ్చు

చిట్కా 2 – ఒక్కో చెంచా చొప్పున కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్ ని కలపండి. వీటిని బాగా కలిపిన తరువాత జుట్టుకు పట్టించండి. దీనివల్ల జుట్టు ఆరోగ్యం పెరుగుతుంది.

చిట్కా 3 – రెండు చెంచాల ఆలివ్ ఆయిల్, చెంచా నిమ్మరసాన్ని మిక్స్ చేయాలి. దీనిని కూడా జుట్టుకు అప్లయ్ చేయచ్చు. ఇది చుండ్రు సమస్యను అరికడుతుంది.

చిట్కా 4 – ఒక బౌల్ లో అరకప్పు పెరుగు, ఒక చెంచా పుదీనా పొడి, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ ని తీసుకోవాలి. వీటిని బాగా కలపాలి. తరువాత దీనిని జుట్టుకు పట్టించాలి. ఇది కూడా హెయిర్ ఫాల్ సమస్యను అరికడుతుంది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
1. జుట్టుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడం ద్వారా చాలావరకు హెయిర్ ఫాల్ ను అరికట్టవచ్చు. బాదం, ఉసిరిలో జుట్టు పెరుగుదలకు తోడ్పడే గుణాలు ఉన్నాయి. వీటిని తగిన మోతాదులో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు అరికట్టవచ్చు.
2. ఒత్తిడిని తగ్గించుకోవాలి. కాలుష్యం నుంచి హెయిర్ ను కాపాడుకోవాలి. అప్పుడే మీ జుట్టు పట్టులా మెరుస్తుంది. మరీ ఎక్కువగా రాలకుండా ఉంటుంది.
3. వెంట్రుకలకు బలాన్నిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆకుపచ్చని కూరలను తీసుకోవాలి.
4. పండ్లతో పాటు విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఐరన్, జింక్ సమపాళ్లలో ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
5. షాంపూలతో మరీ ఎక్కువగా వెంట్రుకలను కడగకూడదు.