చర్మం పగుళ్లు తగ్గాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

చర్మం ఎంత నునుపుగా, బిగుతుగా ఉంటే అంత అందంగా ఉంటుంది. కాని చాలామందికి స్కిన్ లో ఉండే తేమ బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల చర్మమంతా పొడిబారిపోయినట్టు కనిపిస్తుంది. అందులోనూ శీతాకాలంలో చర్మం పగిలిపోతుంది. దీనివల్ల అందం కోల్పోవడంతో పాటు చాలా నొప్పి కూడా ఉంటుంది. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం..

చర్మం పగుళ్లు నివారించాలంటే..
చలికాలంలో శరీరంపై మృతకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తొలగించాలి. అలాగని స్క్రబ్ ను మాత్రం ఉపయోగించకండి. చర్మం స్వభావాన్ని బట్టి.. సరైన ప్రోడక్ట్ ను వాడడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఇక నీటిలో ఎక్కువగా పనిచేసేవారికి కాళ్లు, చేతుల్లో పగుళ్లు కనిపిస్తాయి. కాని వీటిని అలాగే వదిలేస్తే సమస్య చాలా పెద్దది అవుతుంది. అందుకే శరీరాన్ని తడి లేకుండా శుభ్రపరిచి, మాయిశ్చరైజర్ ని అప్లయ్ చేయాలి. మార్కెట్లో దొరికే గ్లిజరిన్ క్రీమ్స్, పెట్రోలియమ్ జెల్లీ ఉన్న మాయిశ్చరైజర్ల వల్ల ఫలితం ఉండొచ్చు. స్క్రబ్బర్ తో పాదాలను వారానికోసారి రుద్దచ్చు. చర్మానికి సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే.. ఏమాత్రం అశ్రద్ధ చేయద్దు. వెంటనే వైద్యనిపుణులను సంప్రదించడం మంచిది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
1. అవిశెలు, బాదంలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి చర్మంలో తేమ బయటకు పోకుండా కాపాడుతాయి.
2. పొట్టు తీయని ధాన్యం, పొట్టు తీయని గోధుమలు, బార్లీ, ముడిబియ్యం.. వీటితో తయారుచేసే ఆహారపదార్థాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం బిగుతుగా ఉంటుంది. శరీరంలో ఉండే విషపదార్థాలను కూడా బయటకు పంపుతాయి.
3. కాలీఫ్లవర్, వాల్ నట్స్, అవకాడో వాడకంతో మొటిమలను తగ్గించవచ్చు.
4. అరటి పండ్లు, జామపండ్లు, నారింజ పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి.
5. బేకరీ ఉత్పత్తులకు దూరంగా ఉంటేనే మంచిది. కాఫీ, టీలు కూడా బాగా తగ్గించాలి. ఇవి చర్మంలో ఉండే సహజసిద్ధమైన మెరుపును తగ్గిస్తాయి.