Cinema

టీవీ యాంకర్ కావాలంటే ఏం చేయాలి? ఏమేం నేర్చుకోవాలి?

చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడితే.. దీనికి వస ఎక్కువ పట్టినట్టున్నారు. అందుకే తెగ వాగుతోంది.. వట్టి వాగుడుకాయ అని పెద్దవాళ్లు సరదాగా తిడుతుంటారు. నిజానికి ఆ వాగుడు వాగడం కూడా అంత ఈజీ కాదు. అందులోనూ సరదాగా మాట్లాడగలగడం మరీ కష్టం. అయినా ఇప్పుడు అలా వాగేవారికే డిమాండ్. ఆ రోజుల్లో అయితే వాగుడుకాయ అనేవారు. కాని ఇప్పుడు వాళ్లను యాంకర్లు అంటున్నారు. వాగడం అంటే మోటుగా ఉంటుంది కాని, అందంగా మాట్లాడగలగడం అంటే.. వినసొంపుగా ఉంటుంది. యాంకర్లందు టీవీ యాంకర్లు వేరయా అని చెప్పాలి. మరి అలాంటి యాంకర్ అవ్వాలంటే..? అబ్బో! చాలా కష్టం అనేస్తారు. నిజంగా అంత కష్టమా? ఏమాత్రం కష్టం కాదు.

యాంకర్ అవ్వాలంటే..
ర్యాంకర్ అవ్వాలంటే కష్టం కాని, యాంకర్ అవ్వాలంటే ఎందుకు కష్టం. మాట్లాడగలగడం వచ్చినవాళ్లు ఎవరైనా కావచ్చు. అయితే అందంగా మాట్లాడగలిగితే కెరీర్ అదిరిపోతుంది అంతే!. ఇదొక్కటే డిఫరెన్స్ మిగిలిందంతా సేమ్ టూ సేమ్. ఈరోజుల్లో టీవీలో కనపడాలని చాలామందికి కోరికుంటుంది. కొంతమంది బయటపడతారు. మరికొంతమంది మనసులో దాచుకుంటారు. ఏదేమైనా టీవీ చూసిన ప్రతీసారీ.. తమను తాము ఏ సుమలాగో, అనసూయలాగో, రష్మీలాగో, శ్రీముఖిలాగో, ఉదయభానులాగానో ఊహించుకోకుండా ఉండరు. అలాంటివాళ్లు పద్దతి ప్రకారం ప్రయత్నాలు చేస్తే.. కచ్చితంగా చేతిలో మైకు పట్టుకుని నాన్ స్టాప్ గా తమకొచ్చిన తెలుగు భాషలో అన్ని పదాలను కిచిడీ చేసి మాటల గారడీతో మెస్మరైజ్ చేసేయచ్చు.

ఈ నాలుగు లక్షణాలూ అవసరం!
యాంకరింగ్ కష్టమని చెప్పలేం కాని మరీ అంత సులభమని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఇంట్లో ఉన్న నలుగురి ముందు మాట్లాడడం వేరు. బయట స్టేజ్ మీద చాలామంది ముందు మాట్లాడి మెప్పించడం వేరు. కాని ఈ రోజుల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ లో పేరెంట్స్ బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనివల్ల ఎక్కువమంది ఇలాంటి కెరీర్ పై దృష్టి పెట్టగలుగుతున్నారు. వాళ్లకు ఉండాల్సిన నాలుగు లక్షణాలు ఏంటంటే.. బాగా మాట్లాడగలగడం.. తెలుగు భాషపై చక్కటిపట్టు.. సందర్భానికనుగుణంగా సామెతలు, చెణుకులు, ఉదాహరణలతో మెప్పించడం, ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ధైర్యం. అబ్బో! ఇన్ని లక్షణాలు మా దగ్గర లేవు. అయినా యాంకర్ అయిపోవాలంతే! అంటారా. ఓకే అలా కూడా అవ్వచ్చు. కాకపోతే కాస్త శ్రమను, మరికాస్త పట్టుదలను, ఇంకాస్త సమయాన్ని కేటాయించగలిగితే.. తెలుగు జాతి గర్వించేలా యాంకర్ గా పేరు తెచ్చుకోవచ్చు.

యాంకర్ గా మార్పు, పేరు కోసం..
యాంకర్ గా మారాలనుకుంటున్నారా? అయితే ఈ అద్భుతమైన, అపురూపమైన, బంగారం లాంటి ఛాన్స్ మీ కోసమే అంటూ రోజూ పేపర్లు, టీవీల నిండా యాడ్లు తెగ వచ్చిపడుతుంటాయి. అందులో అన్ని సంస్థలనూ నమ్మలేకపోయినా.. తెలిసినదానిలో కోచింగ్ తీసుకోవచ్చు. కాని, అలాంటి సంస్థల గురించి బాగా తెలుసుకున్న తరువాతే వాటిలో జాయిన్ అవ్వడం మంచిది. లేదంటే.. యూట్యూబ్ ద్వారా అవసరమైన టెక్నిక్స్ ని తెలుసుకోవచ్చు.. నేర్చుకోవచ్చు. అనుభవజ్ఞులైనవారు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా బాగా ఉపయోగపడతాయి.

ఎలాంటి ప్రోగ్రామ్స్ తో మొదలుపెట్టాలంటే..
చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేయడం ద్వారా పేరుతో పాటు సమస్యలు కూడా తెలుస్తాయి. ప్రతీ సమస్య నుంచి పాఠం నేర్చుకోగలిగితే.. మీ కెరీర్ కు మీరే పునాది రాళ్లు వేసుకున్నట్టు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో యాంకరింగ్ చేయడం వల్ల ప్రశంసలు అందుకోవడంతో పాటు లోపాలు కూడా తెలుస్తాయి. వాటిని కెరీర్ తొలినాళ్లలోనే సరిదిద్దుకోవచ్చు. కాని యాంకరింగ్ నేర్పిస్తామని, అవకాశాలు ఇప్పిస్తామని కొన్ని తోడేళ్లు ఆశ చూపిస్తాయి. గాలమేయడానికి ప్రయత్నిస్తాయి. మోసం చేస్తాయి. జీవితాన్ని నాశనం చేసే ప్రమాదమూ ఉంది. అందుకే బీ కేర్ ఫుల్! తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే.. ఇలాంటి కెరీర్ లో రాణించగలుగుతారని మర్చిపోవద్దు. సో, యాంకర్లుగా మారాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్న అందరికీ సిరిమల్లి తరపు నుంచి ఆల్ ది బెస్ట్.