English Language : ఇంగ్లీష్ తో యుద్ధంలో గెలిచిన హైమా టీచర్
Inspiration Latest

English Language : ఇంగ్లీష్ తో యుద్ధంలో గెలిచిన హైమా టీచర్

English Language : ఐ ఈట్ ఇంగ్లిష్, ఐ డ్రింక్ ఇంగ్లిష్.. అంతే.. బండి అక్కడితో ఆగిపోతుంది. ముచ్చటగా మూడో ముక్క మాట్లడరా అంటే చాలు.. ఫ్యూజులు ఎగిరిపోతాయి. నాకు అంతవరకే వచ్చు బాస్. తరువాత నేర్చుకుంటాలే అని జారుకుంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన భాషల్లో ఒకటైన తెలుగునే మాట్లాడేవారికి ఇంగ్లిష్ మాట్లాడడం ఓ లెక్కా! మీరు అలా తలచుకోండి.. ఇలా నేర్పించేస్తా అనే సరైన టీచర్ మీకు ఎదురుపడి ఉండరు. లేదంటేనా.. ఈపాటికే ఇంగ్లిష్ ని ఓ పట్టు పట్టేవాళ్లు. నిజంగా హైమా టీచర్ గురించి తెలిసుంటే.. బుద్ధిగా వెళ్లి, శ్రద్ధగా ఇంగ్లిష్ ని నేర్చుకునేవారేమో!

కబుర్లు చెప్పమంటే గంటలకొద్దీ చెబుతారు. కానీ అందులో విషయం ఉండదు. అదే పాఠం చెప్పరా అంటే అప్పుడు మొదలవుతాయి అసలు పాట్లు. అందులోనూ ఇంగ్లిష్ లో క్లాస్ తీసుకో అంటే.. పిజ్జా తీసుకో అన్నంత ఈజీగా చెప్పేస్తారేంటి.. క్లాసంటే మాటలా.. చాలా ప్రిపేర్ అవ్వాలి. బోలెడంత ఇంగ్లిష్ రావాలి. దానికోసం చాలా అంటే చాలా చదవాలి అని తప్పించుకుంటారు. కానీ ఆశ అనేది ఒకటుంటుంది కదా.. అది మీకు తెలియకుండానే మీ కోరికను ఆశయంగా మార్చేస్తుంది.. అంటే గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుకలా మారడమన్నమాట. పాఠాలు చెప్పాలన్న తన కోరికను కూడా ఆశయంగా మార్చుకున్నారు హైమా టీచర్.

కష్టం.. నష్టం. వీటి మధ్య ఫ్రెండ్ షిప్ బలంగా ఉంటుంది. ఒకటొస్తే.. రెండోది ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఇంగ్లిష్ భాషను చాలా ఇష్టంగా నేర్చుకుని.. అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ కు కూడా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిన హైమా టీచర్ కు.. జీవితంలో కష్టాలు తప్పలేదు.. దాని వల్ల నష్టాలూ తప్పలేదు. 14 ఏళ్లకే పెళ్లి.. ఆ తరువాత కుటుంబ బాధ్యతలు. ఈ చదువుకోవాలన్న కోరుకుంది చూశారా.. దానికి ఇవన్నీ బ్రేకులు వేసేశాయి. అయినా బ్రేకులకే ఇంజిన్ ఆఫ్ చేసి పక్కన కూర్చునే రకం కాదు. అందుకే ఓ కిరాణా షాప్ పెట్టుకున్నారు. దీనికి కారణం.. తాను ఎవరిమీదా ఆధారపడి ఉండడం హైమా టీచర్ కు ఇష్టం లేదు. అక్కడ కూడా ఇంగ్లిష్ పై ఇష్టాన్ని వదులుకోలేదు.

కిరాణాషాప్ ని రన్ చేస్తూ.. పిల్లలు చూసుకోవడం కష్టం కావడంతో షాప్ ని వదిలి జాబ్ లో జాయిన్ అయ్యారు. అప్పట్లో కాంట్రాక్ట్ బేస్ లో స్టేట్ బ్యాంక్ లో మూడేళ్లపాటు అసిస్టెంట్ క్లర్క్ గా చేసేవారు. తరువాత అక్కడి నుంచి ఓ ఇనిస్టిట్యూట్ లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో జాయిన్ అయ్యారు. జీతం తక్కువే అయినా.. అక్కడుంటే ఇంగ్లిష్ ని నేర్చుకోవచ్చన్న ఆశ.. ఆ జాబ్ లో జాయిన్ అయ్యేలా చేసింది. అలా రెండేళ్లపాటు ఆ జాబ్ చేస్తూనే.. ఇంగ్లిష్ భాషపై పట్టు సంపాదించారు. గ్రామర్ ని పూర్తిగా నేర్చుకున్నారు. టీచింగ్ అంటే తనకున్న ఇష్టాన్ని అక్కడున్న ఇనిస్టిట్యూట్ నిర్వాహకులకు చెప్పడంతో వాళ్లు డెమో ఇవ్వమన్నారు. అలా తానిచ్చిన డెమో వారికి నచ్చడంతో.. ఇంగ్లిష్ టీచర్ గా అవకాశమిచ్చారు.

రోజుకు పది గంటలపాటు పాఠాలు చెప్పాల్సి రావడంతో హైమా టీచర్ కు గొంతులో సమస్య వచ్చింది. దీంతో సర్జరీ తప్పలేదు. కానీ తొలి సర్జరీ ఫెయిల్ కావడంతో మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తరువాత ఓ ఏడాదిపాటు పాఠాలు చెప్పగలిగినా.. డాక్టర్లు మాత్రం ఎక్కువ గంటలపాటు క్లాసులు చెప్పొద్దని అనడంతో టీచింగ్ అవర్స్ ని తగ్గించుకోవాల్సి వచ్చింది. తనకిష్టమైన ఇంగ్లిష్ భాషని, అంతకంటే ఇష్టమైన టీచింగ్ ని ఎక్కువమందికి, ఎక్కువసేపు చెప్పలేకపోతున్నానన్న బాధ ఎక్కువగా ఉన్నా.. ఆరోగ్యరీత్యా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే క్లాసులు తగ్గించుకున్నా, క్వాలిటీ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

కరోనా వల్ల ఆ ఉద్యోగం కష్టమవ్వడంతో వేరే జాబ్ లోకి మారాల్సి వచ్చింది. అయినా సరే టీచింగ్ పై మమకారం వదులుకోలేక.. రోజూ రెండు గంటలపాటు ఫోన్ ద్వారా విద్యార్థులకు క్లాసులు చెబుతారు. ఆదివారాల్లో ఓల్డ్ స్టూడెంట్స్ కి డౌట్స్ క్లారిఫై చేస్తుంటారు. ఇంగ్లిష్ భాషకు సంబంధించి ఆర్&డీ కూడా చేశారు. అప్పుడే ఇంగ్లిష్ టీచింగ్ కు సంబంధించి ఓ ప్రత్యేకమైన మెథడ్ ను తయారుచేసుకున్నారు. ఏ జాబ్ చేయాలన్నా కనీసం డిగ్రీ ఉందా అని అడుగుతున్నారని.. డిస్టెన్స్ మోడ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. అసలు పదో తరగతి చదివిన ఒక అమ్మాయి.. ఇంత సాధిస్తుంది అని ఎవరైనా ఊహించగలరా! లైఫంటే అంతేగా.

మనిషితో చేసే యుద్ధంలో గెలవచ్చేమో కాని.. మనుసుతో చేసే యుద్ధంలో విజయం కష్టం. అయినా హైమా టీచర్ గెలిచి చూపించారు. ఇప్పుడు ఇంగ్లిష్ భాషను నేర్పిస్తూ.. వాళ్లని గెలిపిస్తున్నారు. సాధించాలన్న కోరికుంటే.. సాధ్యం కానిది ఏముంటుంది? చరిత్ర చెప్పేది అదే. భవిష్యత్తు మెచ్చేది ఇదే. అందుకే హైమా టీచర్ అంటే వాళ్ల స్టూడెంట్స్ కు అంత ఇష్టం, అభిమానం, గౌరవం. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్లు కూడా ఇంగ్లిష్ ని ఆమె దగ్గర నేర్చుకుంటున్నారంటే.. అంతకన్నా ఇంకేం కావాలి. ఇంగ్లిష్ అంటే భయపడేవారంతా హైమా టీచర్ లా ఆశను ఆశయంగా మార్చుకుంటే.. ఇంగ్లిష్ ను నేర్చుకోవడం సాధ్యం కాదా.. గలగలా మాట్లాడడం రాదా.. చెప్పండి. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన హైమా టీచర్.. మీరు నిజంగా గ్రేట్. అందుకే సిరిమల్లి.కాం (SIRIMALLI.COM) మీకు మనసారా అభినందనలు తెలుపుతోంది.

Also Read : 

* Immune Food : ఏ టైమ్ లో ఏం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. 40 ఏళ్లు దాటినా..

* Inspirational Story : బంగాళాదుంప, కోడిగుడ్డు, కాఫీ గింజల కథ వింటే మీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది..

* Motivational Story : కరోనా భయం పోవడానికి తొండ, పాము కథే బెస్ట్ మెడిసిన్

* Mahabharata success story on coronavirus : మహాభారతంలో ఈ అస్త్రం లేని యుద్ధం కథ గురించి తెలిస్తే.. కరోనాపై ఈజీగా గెలవచ్చు

* Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

For More Updates Follow us on – Sirimalli Page