Life Style

మీ పిల్లలకు ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ ఇస్తే.. ఆరోగ్యం, హుషారు రెండూనూ!

బుజ్జాయి బొజ్జ నిండుగా ఉంటే అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా చూడాలని మీకూ ఉంటుంది. కాని ఎక్కడా.. అసలు వాళ్లు తింటే కదా. వాళ్లకు కడుపు నిండా తిండి పెట్టాలని చేతినిండా పని పెట్టుకుందామన్నా ఆ కోరిక తీరదాయే! ఏదో కాస్త తింటున్నారు అనేసరికి.. నాకొద్దు మమ్మీ అంటూ ఆడుకోవడానికి బయటకు పరిగెడతారు. లేదా స్కూల్ కు టైమైపోతోంది అంటూ హడావుడిగా బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఒక్కోసారి ఇంట్లో పని ఒత్తిడి వల్ల, పిల్లలు మారాం చేయడం వల్ల వాళ్లకు సరిగా తినిపించలేకపోతారు. కాని దాని వల్ల బాధపడేది పిల్లలే. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాళ్లు బాగా లావైపోయే ప్రమాదముంది. అంటే ఊబకాయంతో బాధపడతారన్నమాట!

రోజుకు రెండుసార్లు బ్రేక్ ఫాస్ట్ తో..
———————————————–
మా పిల్లలు రోజూ ఒక్కసారి బ్రేక్ ఫాస్ట్ చేయడానికే చుక్కలు చూపిస్తారు. ఇక రెండుసార్లు ఎలా పెట్టాలి తల్లీ అనుకోకండి. ఎందుకంటే.. వాళ్ల ఆరోగ్యానికి మించింది ఏముంటుంది ఏ తల్లికైనా! నిజానికి రోజూ రెండుసార్లు అల్పాహారం తీసుకునే పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. దీంతోపాటు చదువులో కూడా ముందుంటారు. బరువు కూడా అదుపులో ఉంటుంది. చాలా పరిశోధనలు చెబుతున్న నిజమిది. రోజూ బ్రేక్ ఫాస్ట్ ని తీసుకునే పిల్లలు.. మిగిలినవారితో పోలిస్తే.. చాలా చురుగ్గా, మెరుగ్గా కనిపిస్తారు.

పిల్లలు.. బ్రేక్ ఫాస్ట్ ని తినేలా చేయాలంటే..
———————————-
ఉదయాన్నే స్కూల్ టైము కన్నా ముందే.. మీ బుజ్జాయిలకు బొజ్జ నిండా ఆహారం పెట్టండి. మళ్లీ స్కూల్ కి వెళ్లాక.. స్నాక్స్ తినే బ్రేక్ ఒకటుంటుంది కదా. ఆ టైంలో తినడానికి వీలుగా మరికొంత ఆహారాన్ని పెట్టండి. ఇలా రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ను రెండుసార్లు తీసుకోవడం వల్ల వాళ్లకు కడుపు నిండుతుంది. అనవసరమైన చిరుతిళ్లకు అలవాటుపడరు. ఆరోగ్యంగా ఉంటారు. వాళ్లకు ఇష్టమైన వంటకాన్ని స్నాక్స్ బ్రేక్ లో తినడానికి వీలుగా సర్దిపెట్టండి. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ను తప్పనిసరిగా తింటేనే.. ఇష్టమైన స్నాక్స్ ని బాక్స్ లో ఉంచుతామని చెప్పండి. మాట వినే పిల్లలకు ఇవన్నీ అక్కర్లేదు. ఒకవేళ ఈ ట్రిక్ పనిచేయకపోతే.. వాళ్లను బుజ్జగిస్తూనో, ఆడిస్తూనో.. ఆహారం పెట్టడం మాత్రం మానేయవద్దు.

అమెరికా పరిశోధన ఏం చెబుతోంది?
——————————
అమెరికాలోని యేల్ యూనివర్సిటీ వాళ్లు 524 స్కూళ్లల్లో ఉన్న పిల్లలపై పరిశోధన చేశారు. అక్కడి చిన్నారుల్లో చాలామందికి ఊబకాయం సమస్య ఉంది. దీనికి కారణం.. వాళ్లు సరిగా బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడమే అని తేల్చారు. అందుకే స్కూల్ టైమింగ్స్ లో స్నాక్స్ కోసం కచ్చితంగా బ్రేక్ ఇచ్చేలా తమ పద్దతిని మార్చుకున్నాయి అక్కడి పాఠశాలలు. అదీ లెక్క. అంటే పిల్లల ఆరోగ్యానికి వాళ్లు ఎంత విలువిచ్చారో చూశారు కదా. అందుకే నేటి బాలలే రేపటి ఆరోగ్యకరమైన పౌరులు కావాలంటే.. ఆ శక్తి మీ చేతిలోనే ఉంది.