Life Style

కళ్ల కింద నల్లని వలయాలు.. ఇవీ తొలగించే పద్దతులు

ముఖం చూస్తే చంద్రబింబం. ఆకారం చూస్తే అద్భుతం. కాని చంద్రుడిలో మచ్చలా.. కళ్ల కింద నల్లని వలయాలు.. ఆ అందాన్ని దెబ్బతీస్తాయి. దీంతో చాలా మంది బాధపడిపోతారు. మరికొంతమంది అయితే నలుగురిలోకి వెళ్లడానికే భయపడతారు. ఇంకొంతమంది కర్చీఫ్ నో, దుప్పటానో కప్పేసుకుంటారు. మేకప్ వేసి కప్పేసేవాళ్ల సంగతి వేరే. కాని వాటిని పూర్తిగా తొలగించుకుంటే ఎలాంటి సమస్యలూ ఉండవు కదా.
నల్లని వలయాలు ఎందుకు వస్తాయి?
మనుషులకు అందం అంటే ప్రేమ. దానికోసం చాలా చేస్తారు. కాని కొంతమంది శరీరాల్లోని వ్యర్థాలు బయటకు వెళ్లవు. దానివల్ల శరీరానికి ఇబ్బంది కలుగుతుంది. శరీరంలోని చెత్తంతా బయటకు వెళ్లాలంటే రోజూ కనీసం పది నుంచి పన్నెండు గ్లాసుల నీళ్లయినా తాగాలి. దీనివల్ల శరీరం శుభ్రపడుతుంది. అప్పుడు డార్క్ సర్కిల్స్ కి అవకాశం ఉండదు

హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నా..
————————————–
– శరీరంలో రక్తం ఉంటే సరిపోదు. అందులో ఉండే హిమోగ్లోబిన్ శాతం కూడా చాలా ముఖ్యం. ఆ శాతం తగ్గితే నల్లని వలయాలు ఏర్పడతాయి. సహజసిద్ధమైన చిట్కాలు పాటించిన తరువాత కూడా అవి తగ్గకపోతే హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవడం వల్ల దానిపై స్పష్టత వస్తుంది. ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. డాక్టర్లను సంప్రదించడం వల్ల తగిన చికిత్స తీసుకోవడానికి వీలవుతుంది.

– మీరు ఎంత సేపు గాఢంగా నిద్రపోతున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. కనీసం 8 గంటల పాటు సుఖవంతమైన నిద్ర ఉండాలి. దీనివల్ల శరీరంలో అన్ని అవయవాలకు సరైన విశ్రాంతి దొరుకుతుంది. అలాంటప్పుడే అవి మిగిలిన రోజంతా హుషారుగా పనిచేస్తాయి. మన మూడ్ కూడా బాగుంటుంది. రోజూ ఒకే టైముకు నిద్రపోవడం, ఒకే వేళకు నిద్రలేవడం కూడా మంచిది.

– నల్లని వలయాలకు మరో ప్రధాన శత్రువు ఒత్తిడి. ఇది శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజూ ధ్యానం చేయడం మంచిది. నెగటివ్ ఆలోచనలను ఎంత దూరంగా ఉంచితే అంత ప్రశాంతత ఉంటుంది. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకండి. బేకరీ ఐటమ్స్ కు దూరంగా ఉండండి.

ఎలాంటి ఆహారంతో ప్రయోజనం..
– పచ్చి కూరగాయ ముక్కలను చెక్కుతో సహా తినడం, తాజా పండ్లు తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. పోషకాహారం వల్ల శరీరంలో అన్ని భాగాలకు తగిన పోషకాలు అందుతాయి. అలాంటప్పుడు డార్క్ సర్కిల్స్ బాధే ఉండదు.

ఎలాంటి చిట్కాలు పనిచేస్తాయి?
– రెండు చెంచాల కొబ్బరిపాలల్లో పావుచెంచా నిమ్మరసం, 2 చెంచాల కీరదోస తురుము, చెంచా ముల్తాన మట్టి, కొద్దిగా క్రీం కలపాలి. దీన్ని కళ్లచుట్టూ పూతలా వేయాలి. దాదాపు 20 నిమిషాల పాటు అలానే ఉంచండి. వారానికోసారి ఇలా చేసినా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.

– కొబ్బరినూనెలో కొంచెం బాదం నూనెను కలపండి. ఆ మిశ్రమాన్ని కళ్లచుట్టూ రాయండి. నెమ్మదిగా మర్దనా చేయండి. ఇలా రోజూ చేస్తే క్రమంగా డార్క్ సర్కిల్స్ తగ్గే అవకాశం ఉంటుంది.

– టొమాటో జ్యూస్ ని కళ్లచుట్టూ రాసుకుని స్మూత్ గా మర్దనా చేసి.. ఓ పావుగంట తరువాత కడిగేయండి. రెండు రోజులకోసారి ఇలా చేసినా రిజల్ట్ కనిపిస్తుంది. పచ్చి బంగాళా దుంప తురుమును పూతలా రాసుకున్నా ప్రయోజనం ఉంటుంది. ఇంకా ఇలాంటి సురక్షితమైన పద్దతులు ఇంట్లో ఉండే బామ్మలకు, అమ్మలకు బాగా తెలుసు. సహజసిద్ధమైన ప్రక్రియలను అనుసరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.