Politics

Mptc, Zptc Elections In AP : ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Mptc, Zptc Elections In AP : ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల విషయంలో హైకోర్టు స్టే పై ఎస్ఈసీ..  డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న డివిజన్ బెంచ్… ఈ ఎన్నికల(Mptc, Zptc Elections In AP) కు సంబంధించి.. తీర్పును వెలువరించింది. ఏపీలో పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది. ఎన్నికలు నిర్వహించినా.. వాటి ఫలితాలను మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రకటించవద్దని చెప్పింది. దీంతో ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయినట్టే.

దీనికన్నా ముందు ఏం జరిగిందంటే.. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఎస్ఈసీ. ఆ తరువాత తన వాదనలు వినిపించింది.
అభ్యర్థి పిటిషన్ ను కాకుండా థర్డ్ పార్టీ అయిన టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవడం పై SEC తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.

28 రోజులు ఎన్నికల కోడ్‌ ఉండాలని సుప్రీం కోర్టు ప్రత్యేక సందర్భంలో చెప్పిందని… కానీ ఇప్పుడు ఆ 28 రోజుల కోడ్‌ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింపచేయాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ వాదనలు వినిపించింది. దీంతో హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద ఈ వాదన వినిపించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. కానీ, ఈ వాదన వినిపించేందుకు సమయం సరిపోలేదని ఎస్‌ఈసీ న్యాయవాది సి.వి.మోహనరెడ్డి ధర్మాసనానికి తెలిపారు.

రిట్‌ పిటీషన్‌ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేయటం లేదని, ఆయన తెలుగుదేశం పార్టీ తరపున ఆ పిటీషన్‌ వేయలేదని.. ఎస్‌ఈసీ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆయన వ్యక్తిగతంగా రిట్‌ పిటీషన్‌ వేయకూడదని.. పిల్‌ మాత్రమే వేయాలని వాదనలు వినిపించారు. అయితే ఎన్నికల విచారణకు ఎస్ఈసీ సరైన పేపర్స్ అందించలేదని భావించిన హైకోర్టు.. విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఆ సమయానికి అన్ని పేపర్స్ ను సరిగా అందించాలని ఆదేశించింది.

మంగళవారం (06-04-2021) నాడు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ZPTC, MPTC ఎన్నికలను నిలిపివేస్తూ ముందుగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. టిడిపి వేసిన  పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నోటిఫికేషన్, పోలింగ్ కు మధ్య 4 వారాలైనా సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పినా.. SEC దానిని పాటించలేదని చెప్పింది. ఈనెల ఒకటో తేదీన SEC ఇచ్చిన నోటిఫికేషన్ లో తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. దీనిపై ఎస్ఈసీ.. హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.

అసలు పరిషత్ ఎన్నికలకు సంబంధించి జరిగిన పరిణామాలను ఓసారి చూస్తే..  ఈ నెల ఒకటినే ఏపీ కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలంసాహ్ని.. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తరువాత అఖిలపక్షం మీటింగ్ పెట్టారు. కానీ విపక్షాలు మాత్రం.. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. ఆ తరువాతే అఖిలపక్ష సమావేశానికి పిలిచిందని ఆక్షేపించాయి. అంత ఆదరాబాదరాగా నోటిఫికేషన్ ను జారీచేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.

నిజానికి ఏపీలో ఈనెల 8న ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లను చేసింది ఎస్ఈసీ. కానీ దానికి రెండు రోజుల ముందు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలతో బ్రేక్ పడింది. తరువాత డివిజన్ బెంచ్ తీర్పు వచ్చింది.  అయినా ఈ ఎన్నికల ప్రక్రియ ఇప్పటిది కాదు. గతంలోనే పరిషత్ పోరు ఓసారి నిలిచిపోయింది. అందుకే ఆగిన చోటే మళ్లీ ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టుగా గత నెల 15వ తేదీనే ఎస్ఈసీ.. హైకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించింది.

 

Also Read : తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. జీహెచ్ఎంసీలో ఆ డివిజన్ కు కూడా..

Also Read : హీరోయిన్ నయనతారపై నటుడు రాధారవి తీవ్ర వ్యాఖ్యలు

మరింత సమాచారం కోసం మా ఫేస్ బుక్ పేజ్ సిరిమల్లిని ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage