Off Beat

corona success stories : ఈ 85 ఏళ్ల వృద్ధురాలిని చూసి ధైర్యాన్ని తెచ్చుకోండి.. కరోనాతో నెల రోజులు ఫైట్ చేసి గెలిచిన బామ్మ!

corona success stories : 85 యేళ్ళ మా అమ్మమ్మ పోయిన ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడింది. ఆసుపత్రిలో బెడ్స్ సంపాదించడం గగనమైంది. చివరికి కర్నూలు జనరల్ ఆసుపత్రిలో ఒక బెడ్. ఆ ఆసుపత్రి ఓ సముద్రం. (corona success stories)

ఆమె ఆక్సిజన్ శాతం 50%.
అప్పుడు ఈ రెమ్డెస్వీర్ ల సుత్తి గోల లేదు.

ఆక్సిజన్ థెరపీ ఇచ్చారు.
స్టిరియిడ్స్, హెపారినూ ఇచ్చారు.

బలహీనతతో ఆమె సొమ్మసిల్లి పడిపోయేది.
అక్కడ పెట్టే భోజనం లో ఓ రెండు మెతుకులు తినగలిగేది.
మా బావమరిది పేషంట్ అటెండర్ గా వెళ్ళి ప్రొటీన్ పౌడర్ తో పాలూ, డ్రై ఫ్రూట్స్ తినిపించేవాడు. ఆ పాలు తాగడమే ఆమెకు గగనంలా ఉండేది. రాత్రి ఆక్సిజన్ పెట్టి పోతే పొద్దున్న వచ్చేసరికి ఆమె నిద్రలో ఆక్సిజన్ మాస్కు కిందపడిపోయి ఉండేది. అంటే రాత్రి అంతా ఆక్సిజన్ లేకుండానే అలా మంచంపై పడి ఉండేది. ఆ సమయంలో నర్సింగ్ స్టాఫ్ కొరతా ఉండేది. ఎవరూ చూసి మాస్కును సరి చేసే వారు లేరు. పొద్దున మా బావమరిది వెళ్ళి చూసేసరికి ఆక్సిమీటర్ లో 50- 60% కనబడేది. మళ్ళీ ఆక్సిజన్ మాస్కు పెడితే పెట్టుకునేది. తిండిలేకపోవడం వలన విపరీతమైన నిస్సత్తువ వలన Almost semi conscious state లో ఉండేది. ఒకసారి hypoglycemia అయింది. మరోసారి sodium తగ్గి hyponatremia అయింది. అలా ఆసుపత్రిలో నెల రోజులుండింది.

ఆమె జీవితంలో ఎన్నో ఢక్కా ముక్కీలు తిన్నది. ఎన్నో బాధలు అనుభవించింది. జీవితంతో పోరాడిన చరిత్ర ఉన్నది. అందుకే ఈ కరోనా ఆమెకో లెక్కే కాదు. నేను ఫోన్లో వీడియోలో మాట్లాడుతూ ఎలా ఉన్నావ్ అమ్మమ్మా అంటే…
“నాకేమైందిరా బాగానే ఉన్నా..నీరసంగా ఉంది అంతే!!” అనేది . అక్కడ ఆక్సిజన్ శాతం చూస్తే ఏ 60% 70% మాత్రమే చూపేది. నాకు గుండె దడదడలాడేది. ఆమె మాత్రం అంత నీరసంలోను నవ్వేది. మీ ఆరోగ్యం జాగ్రత్త అని మాకు సుద్దులు చెప్పేది.

ఒక నెల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది. మనిషి చిక్కి సగమైంది. అతి నీరసంగా ఉండేది. ఆసుపత్రి నుండి డైరెక్ట్ గా మా ఇంటికి హైదరాబాద్ కి తెచ్చేసుకున్నాను. వీక్నెస్ తప్ప మరేమీ లేదు. ఆమె ధైర్యానికి ఆశ్చర్యం కలిగింది. ఇంట్లో ఉంచుకుని ఆరు నెలలు అమ్మమ్మకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. చక్కగా కోలుకుని మా వూరికి వెళ్ళిపోయింది. ఇపుడు అన్ని పనులు చేసుకోగలుగుతుంది. మునుపంతటి శక్తి లేకపోయినా ఆమె తన పని చేసుకోవడం మాత్రం వదలడం లేదు.

నమ్మకం. జీవితం మీద ఎనలేని నమ్మకం. ఎంతటి సమస్య వచ్చినా నింపాదిగా ఉండగలగడం. ఆమెకు కరోనా అంటే తెలియదు. ఏదో మాయదారి రోగం అని తప్ప. రోజూ వార్తలు వింటూ బెంబేలెత్తిపోయే గుణం లేదు. డాక్టర్లపై అపనమ్మకాలు లేవు. మందులపై అపోహలు లేవు. ఒకరిని దూషించడం తెలియదు. ఇంటికి వచ్చిన వారికి కడుపునిండా కమ్మటి వంట చేసి పెట్టడం ప్రేమను పంచడం తప్ప మరోటి తెలీదు. నేనూ మూడోతరగతి వరకు అమ్మమ్మ ఒడిలోనే పెరిగాను, చందమామ కథలు వింటూ.

ఆమె జీవిత దృక్పథం ముందు ఎంత పెద్ద సమస్య ఐనా చిన్నదే. నవ్వుతూ ఎదుర్కోవడమే. ఎదుర్కొని దాటడమే. “జ్వరాలు వస్తే ఏమౌతుంది. మూడు రోజులుంటే తగ్గుతుంది అంతేకదా!” అనే వైఖరి. ఇపుడు ఎంతమంది ఇలాంటి దృక్పథం కలిగున్నారో చెప్పండి. అనవసరంగా బెంబేలెత్తిపోయే వాళ్ళే ఎక్కడ చూసినా. అన్నీ అనుమానాలే. మళ్ళీ రెండు మూడు రోజుల్లో అంతా బాగైపోవాలనే ధోరణి. ఎలా సాధ్యం?. ఓపిక ఉండాలి. శరీరానికి తనను తాను బాగు చేసుకునే గుణం ఉంది. కొంత సమయం ఇవ్వాలి కదా. మన తరానికి అంతా తొందరే..ఆ పాత తరానికి గల గుణమే నింపాదిగా ఉండగలగడం. అది అలవరచుకుంటే కరోనా అసలేమీ చేయలేదు. ఇది నిజం.

విరించి విరివింటి ..

ఇవి కూడా చదవండి : 

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

Also Read : Corona Virus : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

Also Read : Corona Virus : Corona Virus : ఈ 2 రకాల పండ్లు, 3 రకాల పనులు చాలు.. బలమైన ఇమ్యూనిటీ మీ సొంతం

Also Read : Corona Virus : కరోనా బాధితులు.. ఏ స్వీట్ ని తింటే మళ్లీ వాసన, రుచిని వేగంగా పొందవచ్చు?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage